విజయవాడకు రూ.950, విశాఖకు రూ.2500 : ప్రైవేట్‌ ట్రావెల్స్ సంక్రాంతి దోపిడీ

  • Publish Date - January 12, 2020 / 01:50 AM IST

సంక్రాంతి సంబరాలేమో కానీ.. ప్రయాణం పేరు చెబితేనే వణుకు పుడుతోంది. ముందు ఛార్జీల వంతు అయితే.. రెండోది ట్రాఫిక్‌ జామ్‌. టోల్‌ ప్లాజా దగ్గర కిలోమీటర్ల మేర.. గంటల కొద్దీ వెయిట్‌ చేయాల్సిన పరిస్థితి ఉంది. సంక్రాంతి పండుగ కోసం జనం సొంతూళ్లకు ప్రయాణమవుతున్నారు. సంక్రాంతి సమయంలో హైదరాబాద్‌ నుంచి ఏపీకి వెళ్లేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. దీంతో విజయవాడ రూట్‌లో ప్రయాణికులు, వాహనాలతో రద్దీ వాతావరణం నెలకొంది. అటు మహబూబ్‌నగర్‌ రూట్‌లో కూడా వాహనాల రద్దీ భారీగా ఉంది. 

సంక్రాంతి పండుగ నేపథ్యంలో దాదాపు అన్ని టోల్‌ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతోంది. నల్లగొండ జిల్లాలోని పంతంగి, కొర్లపహాడ్‌ టోల్‌గేట్ల వద్ద విజయవాడ మార్గంలో కిలోమీటర్‌ వరకు వాహనాలు నిలిచిపోయాయి. పంతంగి టోల్‌ప్లాజా వద్ద రెండు వైపులా 16 గేట్లు ఉండగా విజయవాడ వైపు పది గేట్లు తెరిచారు. కొర్లపహాడ్‌ వద్ద 8 బూత్‌లు తెరిచారు. 

ఈ సారి ఫాస్టాగ్‌ను అమల్లోకి తీసుకురావడంతో మరిన్ని ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా యాదాద్రి జిల్లా గూడూరు టోల్‌ప్లాజా వద్ద ఫాస్టాగ్‌ గేట్ల పనితీరు అస్సలు బాగోలేదు. ఫాస్టాగ్‌ను గుర్తించే పరికరాలు సరిగా పనిచేయకపోవడంతో వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు. సాంకేతిక సమస్యలతో ఫాస్టాగ్‌ ఉన్న వాహనదారులకు టోల్‌ గేట్ల వద్ద రద్దీ తిప్పలు తప్పలేదు.  

అటు ఛార్జీల బాదుడు కూడా ఓ రేంజ్‌లో ఉంది. ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. విజయవాడకు 950 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. విశాఖకు ఏకంగా 2500 రూపాయలు వసూలు చేస్తున్నారు. వేరే ఆప్షన్‌ లేకపోవడంతో రేటు ఎక్కువైనా సరే.. సొంతూళ్లకు వెళ్తున్నారు.