ఓటమికి నువ్వే కారణం : ఉత్తమ్‌పై సర్వే ఫైర్

  • Publish Date - January 7, 2019 / 02:07 PM IST

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమికి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కారణమని కాంగ్రెస్‌ నుంచి సస్పెండైన కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఆరోపించారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఫోన్‌ చేసిన సహాయ నిరాకరణ చేయించారని మండిపడ్డారు. ఉత్తమ్‌ టీఆర్‌ఎస్‌తో మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని సర్వే ఆరోపించారు. పార్టీ పంపిన డబ్బులు కూడా ఇవ్వలేదన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్‌ పార్టీలో సర్వే సత్యనారాయణ రగడ సంచలనం రేపింది. రౌడీ మూకలను కాంగ్రెస్ పెంచి పోషిస్తోందని సర్వే విమర్శించారు. దారిన పోయే దానయ్యలను పెంచి పోషించి జనరల్ సెక్రటరీ పదవులు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గాలపై గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ సమీక్షా సమావేశంలో కాంగ్రెస్ ఇంచార్జి కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌‌పై సర్వే అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో రౌడీ మూకలున్నాయని అన్నారు. అర్హత లేనివాళ్లకు ఉత్తమ్ పదవులిచ్చారని, పీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. పార్టీకి నష్టం చేసినవాళ్లే మళ్లీ రివ్యూలు చేస్తే ఎలా అని సర్వే ప్రశ్నించారు. సర్వే అనుచిత వ్యాఖ్యలు చేయడంతో హైకమాండ్ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.