సీఎం దృష్టికి తీసుకెళ్తా : సేవ్ నల్లమలపై స్పందించిన కేటీఆర్.. థ్యాంక్స్ చెప్పిన మెగా హీరో

సేవ్‌ నల్లమల... తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తున్న నినాదం. సామాన్యులే కాదు సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్లు సైతం దీనిపై గళమెత్తుతురన్నారు. పచ్చటి అడవుల్లో చిచ్చు

  • Publish Date - September 14, 2019 / 03:16 AM IST

సేవ్‌ నల్లమల… తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తున్న నినాదం. సామాన్యులే కాదు సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్లు సైతం దీనిపై గళమెత్తుతురన్నారు. పచ్చటి అడవుల్లో చిచ్చు

సేవ్‌ నల్లమల… తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తున్న నినాదం. సామాన్యులే కాదు సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్లు సైతం దీనిపై గళమెత్తుతున్నారు. పచ్చటి అడవుల్లో చిచ్చు పెట్టొద్దని సాగుతున్న ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారు. తాజాగా దీనిపై స్పందించిన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్… ఈ ఇష్యూను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. నల్లమలలో యురేనియం తవ్వకాల వ్యవహారం దుమారం రేపుతోంది. యురేనియంతో తెలుగు రాష్ట్రాలకు ఊపిరితిత్తులాంటి నల్లమల అడవులు సర్వనాశనమవుతాయనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అడవి తల్లినే నమ్ముకున్నామని, తమ జీవితాలు ఛిన్నాభిన్నమవుతాయని ఓ వైపు గిరి పుత్రులు కంటతడి పెడుతుంటే… మేమున్నామంటూ వారికి మద్దతుగా రంగంలోకి దిగారు రాజకీయ నేతలు, గిరిజన సంఘాలు, మేధావులు. సేవ్ నల్లమల పేరుతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు.

యురేనియం పేరిట పచ్చటి అడవులను నాశనం చేయొద్దంటూ అన్నివర్గాల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. యురేనియం తవ్వకాలపై అందరి ఆవేదనను తాను చూస్తున్నానని ట్వీట్ చేశారు. ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి వ్యక్తిగతంగా తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కేటీఆర్ ట్వీట్ కి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ స్పందించారు. కేటీఆర్ కి థ్యాంక్స్ చెప్పారు. యురేనియం తవ్వకాలపై టాలీవుడ్‌లోనూ తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. సినీ తారలు, దర్శకులు, పలు రంగాల ప్రముఖులు పోస్టర్లు పట్టుకుని మరీ ప్రచారం చేస్తున్నారు. విజయ్ దేవరకొండ, పవన్ కల్యాణ్, శేఖర్ కమ్ముల, సాయిధరమ్‌ తేజ్, రామ్, అనసూయ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. యురేనియాన్ని కొనొచ్చు… అడవులను కొనగలమా అని ప్రశ్నిస్తున్నారు. 

టాప్ హీరోయిన్ సమంత కూడా వీరితో జత కలిసింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను ఉద్దేశించి పోస్ట్ పెట్టింది. యురేనియం తవ్వకాలను ఆపి నల్లమల అడవులను కాపాడాలని సమంత కోరింది. ఈ విషయాన్ని రాష్ట్రపతి కోవింద్‌ దృష్టికి తీసుకెళ్తూ ఆన్‌లైన్‌ పిటిషన్‌పై సంతకం చేసింది. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తాను సంతకం చేశానని… మీ సంగతి ఏంటని అభిమానుల్ని ప్రశ్నించింది. వామపక్ష విద్యార్థి సంస్థ డీవైఎఫ్ఐ రూపొందించిన పోస్టర్‌ను కూడా సమంత ట్విట్టర్‌లో జత చేసింది. అమ్రాబాద్ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం చేయాలనుకుంటున్న యురేనియం తవ్వకాల వల్ల పర్యావరణం దెబ్బతింటుందని సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సేవ్‌ నల్లమల ఉద్యమానికి సెలబ్రిటీలే పునాది రాళ్లుగా మారారు. పర్యావరణం ధ్వంసం అవడమే కాకుండా ప్రజారోగ్యం తీవ్ర ప్రభావానికి లోనవుతుందని తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు.

మొత్తంగా… అడవి బిడ్డలను అదుకునేందుకు, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే చర్యలపై పోరాడేందుకు అందరూ ఒక్కటవుతున్నారు. సినీ, రాజకీయ రంగ ప్రముఖులతోపాటు సామాజిక కార్యకర్తలు, పర్యావరణ వేత్తలు… నల్లమలను సేవ్ చేయాలంటూ నినదిస్తున్నారు.