పిల్లల హుండీ డబ్బే ఇది : పేదల చదువు కోసం రూ.18లక్షల విరాళం 

అమ్మానాన్నా ఇచ్చిన  పాకెట్ మనీతో చిరుతిళ్లు తినే చిన్నారులు అందరికీ ఆదర్శంగా నిలిచారు.

  • Publish Date - January 31, 2019 / 06:00 AM IST

అమ్మానాన్నా ఇచ్చిన  పాకెట్ మనీతో చిరుతిళ్లు తినే చిన్నారులు అందరికీ ఆదర్శంగా నిలిచారు.

హైదరాబాద్: చిట్టి చేతులు గట్టి మేలును తలపెట్టాయి. చిన్ననాటినుండే సేవా భావం చిన్నారుల్లో పెరుగుతోందని చెప్పటానికి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అమ్మానాన్నా ఇచ్చిన  పాకెట్ మనీతో చిరుతిళ్లు తినే చిన్నారులు అందరికీ ఆదర్శంగా నిలిచారు సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు. పేద విద్యార్థుల చదువు కోసం రూ.18లక్షలు విరాళంగా ఇచ్చారు. 

 

విద్యార్థుల్లో సేవా భావాన్ని పెంపొందించే లక్ష్యంతో హైదరాబాద్‌ బాచుపల్లి సిల్వర్‌ ఓక్స్‌ స్కూల్  యాజమాన్యం ఏటా ‘కాయిన్స్‌ ఫర్‌ ది కంట్రీ’ పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది.  2013-14  నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతోంది. స్కూల్ లోని 3 వేల మంది పిల్లలకు హుండీలను బహుమతిగా ఇస్తోంది. విద్యార్ధుల బర్త్ డే వంటి ఇతర సరదాలను తగ్గించుకుని ఆ డబ్బును పొదుపు చేస్తారు. హుండీ నిండిన తర్వాత స్కూల్ కు అప్పగించాలనేది ‘కాయిన్స్‌ ఫర్‌ ది కంట్రీ’ కార్యక్రమం నిబంధన. కిండర్ గార్టెన్ నుంచి క్లాస్ 12 వరకు  2వేల 500 మంది విద్యార్థులు ఆగస్టు నుంచి జనవరి వరకు డబ్బును సేవ్ చేస్తున్నారు. అలా సేవ్ చేసిన మొత్తం రూ.18లక్షలు అయ్యింది.
 

2018-19 వరకు విద్యార్ధుల నుంచి సేకరించిన ఈ ఫండ్ ను 2019, జనవరి 30వ తేదీ మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ‘మీ అండ్‌ మై కంట్రీ వుయ్‌ గ్రో టు గెదర్‌’ అనే నినాదంతో ఈ రూ.18లక్షలను సిల్వర్‌ ఓక్స్‌ స్కూల్  యాజమాన్యం ఆర్‌డీఎఫ్‌, నైస్‌ సంస్థలకు అందజేశారు.
 

విద్యార్థుల్లో  నీటి పొదుపు, విద్య, పరిశుభ్రత, కాలుష్య నివారణ వంటి అంశాలను వీది నాటకాలుగా రూపొందించి నగరంలో ప్రదర్శిస్తుంటారని ప్రిన్సిపాల్‌ రావి సీతామూర్తి తెలిపారు. పుస్తకాల అమ్మకాలు వంటి పనులు చేస్తూ విద్యార్ధులు డబ్బు సంపాదించారని తెలిపారు. ఇప్పటి వరకు రూ.కోటికిపైగా పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేసినట్లు స్కూల్ యాజమాన్యం తెలిపింది.