రెండో విడత పంచాయతీ ఎన్నికలు : ఎవరికెన్ని సర్పంచ్ లు

తెలంగాణలో రెండో విడత పంచాయితీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారుల హవా కొనసాగింది.

  • Publish Date - January 26, 2019 / 05:55 AM IST

తెలంగాణలో రెండో విడత పంచాయితీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారుల హవా కొనసాగింది.

హైదరాబాద్ : తెలంగాణలో రెండో విడత పంచాయితీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. టీఆర్ఎస్ మద్దతుదారుల హవా కొనసాగింది. ఏకగ్రీవమైన పంచాయతీలు కలుపుకుని 4,130 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 2,611 పంచాయతీల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. 837 గ్రామాల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు గెలుపొందారు. టీడీపీ 39, బీజేపీ 37, సీపీఎం 24, సీపీఐ 13, ఇతరులు 560 గ్రామాల్లో విజయం సాధించారు. ఈనెల 30న మూడో విడత పంచాయతీ పోలింగ్‌ జరుగనుంది.

పది జిల్లాల్లో టీఆర్ఎస్ మద్దతు అభ్యర్థులు విజయం సాధించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 54, కరీంనగర్‌- 43, ఖమ్మం- 127, మహబూబాబాద్‌-109, మెదక్‌- 124, నల్గొండ- 135, రాజన్న సిరిసిల్ల- 47, సిద్దిపేట-142, వరంగల్‌ గ్రామీణం- 101, అర్బన్‌లో 19 పంచాయతీలను టీఆర్ఎస్ మద్దతుదారులు గెల్చుకున్నారు.

కొన్ని జిల్లాల్లో మాత్రం కాంగ్రెస్‌ పట్టు సాధించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 40, భద్రాచలం-23, జయశంకర్‌ భూపాలపల్లి-45, కామారెడ్డి- 54, మెదక్‌-34, నల్గొండ-38, రంగారెడ్డి-55, సంగారెడ్డి-37, సూర్యాపేట-36, వికారాబాద్‌ జిల్లాలో 51 పంచాయతీలను కాంగ్రెస్‌ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు.

ఖమ్మం జిల్లాలో టీడీపీ మద్దతుదారులు 19 చోట్ల విజయం సాధించారు. వనపర్తి, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని కొన్నిపంచాయతీల్లో ఉనికి చాటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 6, సంగారెడ్డిలో 7 పంచాయతీలలో బీజేపీ మద్దతుదారులు గెలుపొందారు.

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 88.26శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. గరిష్టంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 93.71శాతం పోలింగ్‌ నమోదైంది. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో అత్యల్పంగా 80.74శాతం పోలింగ్‌ నమోదైంది. పది జిల్లాల్లో 90శాతానికిపైగా పోలింగ్  నమోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. రెండో విడతలో ఐదు గ్రామాల్లో పోలింగ్‌ జరుగలేదు. 788 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.  దీంతో 3,342 గ్రామాల్లో పోలింగ్‌ నిర్వహించారు.  వివిధ కారణాలతో రెండు సర్పంచ్‌ స్థానాలకు పోలింగ్‌ వాయిదా వేశారు. 

  • 788 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం
  • 2,611 పంచాయతీల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు విజయం
  • 837 పంచాయతీల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు గెలుపు 
  • 39 పంచాయతీల్లో టీడీపీ మద్దతుదారులు విజయం
  • 37 పంచాయతీల్లో బీజేపీ మద్దతుదారులు గెలుపు  
  • 24 పంచాయతీల్లో సీపీఎం మద్దతుదారులు విజయం
  • 13 పంచాయతీల్లో సీపీఐ మద్దతుదారులు జయకేతనం
  • 560 పంచాయతీ ఇతరులు విజయం