షైన్‌ హాస్పిటల్ ప్రమాదంపై మంత్రి ఈటల సమీక్ష : నివేదిక ఇవ్వాలని ఆదేశాలు

  • Publish Date - October 21, 2019 / 10:57 AM IST

హైదరాబాద్ లోని ఎల్బీనగర్ షైన్ పిల్లల ఆస్పత్రి అగ్ని ప్రమాద ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అగ్నిప్రమాదంపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విచారణ అధికారిగా వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు డా.రవీంద్రనాయక్‌ను నియమించారు. 24 గంటల్లో నివేదిక అందజేయాలని అధికారులకు మంత్రి ఈటల ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు డీఎంహెచ్ వో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. 

కాగా..ఈ ప్రమాదం జరిగిన అనంతరం షైన్ ఆస్పత్రి ఎండీ సునీల్ కుమార్ రెడ్డిని ఎల్బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.304 ఏ కింద కేసు నమోదు చేశారు. షైన్ ఆస్పత్రిపై కూడా  ఎల్బీ నగర్ పోలీసులు కేసు బుక్ చేశారు. షైన్‌ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఐసీయూలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగిన ప్రమాదంలో ఊపిరి ఆడక ఎనిమిది నెలల చిన్నారి మృతి చెందగా.. పలువురు చిన్నారులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రిలో 42మంది చిన్నారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం ఇతర ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రి ఎదుట బాధిత తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఈ ఘోరం జరిగిందన్నారు. పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడతారా అని మండిపడ్డారు. షైన్ ఆస్పత్రిని పోలీసులు సీజ్ చేశారు.