సింధూశర్మ కేసు : పెద్ద కూతురు రిషితను తల్లికి అప్పగించాలని హైకోర్టు ఆదేశం

  • Publish Date - May 2, 2019 / 09:37 AM IST

తన పెద్ద కూతురిని తనకు అప్పగించాలని హైకోర్టు రిటైర్డ్ జడ్జి నూతి రామ్మోహన్ రావు కోడలు సింధూ శర్మ హైకోర్టులో వేసిన పిటిషన్ పై విచారణ ముగిసింది. పెద్ద కూతురు రిషితను తల్లి సింధూకి అప్పగించాలని కోర్టు ఆదేశించింది. అదే సమయంలో వారానికి 2 రోజులు తండ్రి వశిష్ట దగ్గర రిషితను ఉంచాలని స్పష్టం చేసింది. ప్రతి శుక్రవారం రాత్రి పెద్ద కుమార్తె రిషితను తండ్రి తీసుకోవాలని.. సోమవారం ఉదయం సింధూ శర్మకి అప్పగించాలని కోర్టు చెప్పింది. జూన్ 4 వరకు ఈ ప్రక్రియను కొనసాగించాలని ఆదేశించిన కోర్టు.. తదుపరి విచారణను జూన్ 4వ తేదీకి వాయిదా వేసింది.

కొడుకు, కోడలి వివాదం కేసు నుంచి తనను, తన భార్యను తప్పించాలని రామ్మోహన్ రావు కోర్టుకి విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చిన కోర్టు.. కుదరదని చెప్పింది. కలిసి ఉండేందుకు వశిష్ట, సింధూ శర్మ ఏకాభిప్రాయానికి వస్తే ధర్మాసనానికి తెలపాలని రామ్మోహన్ రావుకి కోర్టు చెప్పింది. భర్త వశిష్టతో తెగదెంపులు చేసుకునే ఆలోచన తనకు లేదని సింధూ శర్మ కోర్టుకి తెలిపింది. తల్లి దగ్గర ఉంటానని పెద్ద కూతురు రిషిత ధర్మాసనానికి చెప్పింది.

అత్తింటి వేధింపులు, పిల్లల కోసం సింధూ శర్మ పోరాటం చేస్తోంది. పెద్ద కుమార్తెను తనకు అప్పగించాలని కోరింది. ఇప్పటికే చైల్డ్ హెల్ప్ లైన్ ద్వారా చిన్న కుమార్తె శ్రీవిద్యను దక్కించుకున్న సింధూశర్మ… పెద్ద కుమార్తె కోసం చేసిన పోరాటం ఫలించింది. ఏప్రిల్ 28, 2019న చిన్న పాపను సింధూశర్మకి అప్పగించిన రామ్మోహన్ రావు కుటుంబసభ్యులు పెద్ద పాప రిషితను అప్పగించేందుకు అంగీకరించలేదు. దీంతో సింధూ శర్మ హైకోర్టులో పిటిషన్ వేసింది.

పెద్ద కూతురికి అన్ని విషయాలు తెలుసని.. తనపై ఎలా దాడి చేశారో కూడా తెలుసని సింధూ చెబుతోంది. అన్ని విషయాలు బయటపెడుతుందనే పెద్ద పాపను తనకు అప్పగించడం లేదని, తమను బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారని సింధూ వాపోయింది. నూతి రామ్మోహన్‌ రావుపై కోడలు సింధూ శర్మ వరకట్న వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన భర్త, అత్తమామలు కలిసి తనను మానసికంగా, శారీకరంగా వేధిస్తున్నారని పోలీసులకు కంప్లయింట్ చేసింది.