లంచాలు తీసుకున్న ఆరుగురు పోలీసు అధికారుల పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఆరుగురిని సస్పెండ్ చేస్తూ సీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాది క్రితం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో పని చేసిన ఎస్‌ఐలు కురుమూర్తి, డి.శ్రీను, ఇ.శంకర్, రామకృష్ణ, ఎఎస్‌ఐలు మహ్మద్ జాఫర్, ఎస్ శామ్యుల్‌లు హుక్కా సెంటర్ల యజమానుల నుంచి లంచాలు తీసుకున్నారు. ఆకస్మిక సోదాలపై యజమానులకు ముందస్తు సమాచారం ఇస్తూ వారి నుంచి భారీగా డబ్బులు తీసుకున్నారు.
ఈ వ్యవహరంపై ఇటీవల హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌కు ఫిర్యాదు అందింది. దీంతో విచారణ జరిపించిన సీపీ లంచాలకు సంబంధించిన పూర్తి ఆధారాలను సేకరించి ఆరుగురిపై చర్యలు తీసుకున్నారు. ఈ ఆరుగురిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం ఇద్దరు ఏఎస్‌ఐలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తుండగా, మిగిలిన నలుగురు ఇతర పోలీస్ స్టేషన్‌లు, విభాగాలకు బదిలీ అయ్యారు. ఆరుగురు పోలీసు అధికారులు ఒకేసారి సస్పెండ్ కావడంతో పోలీసు వర్గాల్లో కలకలం రేపింది.