ఆర్టీసీలో సమ్మె విరమణ ప్రకటన చిచ్చుపెట్టింది. జేఏసీలో చీలిక తెచ్చింది. వరంగల్ రీజియన్ లో కార్మికులు రెండు వర్గాలుగా విడిపోయారు.
ఆర్టీసీలో సమ్మె విరమణ ప్రకటన చిచ్చుపెట్టింది. జేఏసీలో చీలిక తెచ్చింది. వరంగల్ రీజియన్ లో కార్మికులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఆర్టీసీ జేఏసీపై నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు తిరుగుబాటు ప్రకటించారు. హన్మకొండ బస్టాండ్ లో ఆర్టీసీ జేఏసీ దిష్టిబొమ్మను దహనం చేశారు. సమ్మెను నిర్వీర్యం చేశారంటూ జేఏసీ నేతలపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 మంది కార్మికుల ఆత్మహత్యలకు జేఏసీ నేతలే కారణమని ఆరోపించారు. సమ్మె విరమణకు సిద్ధంగా ఉన్నామని నిన్నజేఏసీ ప్రకటించిన విషయం తెలిసిందే.
వరంగల్ రీజియన్ లో 9 బసు డిపోలు ఉన్నాయి. అన్ని డిపోలకు చెందిన మొత్తం కార్మికులు సమ్మెలో ఉన్నారు. సమ్మెను విరమించేందుకు ఎవరు కూడా సుముఖంగా లేరు. అయితే నిన్న జరిగిన జేఏసీ మీటింగ్ లో చేసిన సమ్మె విరమణ ప్రకటనపై కార్మికులు భగ్గుమన్నారు. హన్మకొండలోని ఏక శిలా పార్క్ లో భేటీ అయిన కార్మిక సంఘాలు.. జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఏ వ్యూహాన్ని అనుసరించాలని సమాలోచనలు జరుపుతున్న క్రమంలోనే హన్మకొండ బస్టాండులో ఎన్ ఎమ్ యూకు సంబంధించిన కార్మిక సంఘం నాయకుడు యాకస్వామి నేతృత్వంలో కార్మికులంతా జేఏసీపై తిరుగుబాటు చేశారు.
జేఏసీ ప్రభుత్వ అడుగులకు మడుగులు ఒత్తే పరిస్థితి చేసిందని, జేఏసీ, దానికి సంబంధించిన నేతలంతా పూర్తిగా ప్రభుత్వానికి లొంగిపోయారని విమర్శించారు. కార్మికులకు సంబంధించిన ప్రయోజనాలన్నింటినీ పనంగా పెట్టారని తీవ్రంగా విమర్శిస్తూ ఎన్ ఎమ్ యూ కార్మికులు జేఏసీ దిష్టిబొమ్మను దహనం చేశారు. జేఏసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమ్మె పేరుతో డ్రామాలు ఆడారని, 48 రోజులుగా సమ్మె నాటకమాడుతూ ఒక్కరోజుకే సమ్మెను విరమించాలని ప్రకటన చేసి, కార్మికుల మనోభావాలను దెబ్బతీశారని తీవ్రంగా విమర్శించారు. సమ్మె కాలంలో కార్మికుల ఆత్మహత్యలకు జేఏసీయే పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. జేఏసీ కార్మికుల ఆత్మగౌరవాన్ని ప్రభుత్వం కాళ్ల దగ్గర తాకట్టు పెట్టిందని ఎన్ ఎమ్ యూ నేతలు తీవ్రంగా విమర్శించారు.
ప్రభుత్వం చర్చలకు పిలవాలని పదే పదే అంటూ కాళ్లావేళ్ల పడ్డంత పని చేస్తున్నారని మండిపడ్డారు. 48 వేల మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మగౌరవంతో సమ్మె చేస్తే, కార్మికుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా 48 రోజులు గడిచిన తర్వాత సమ్మె విరమిస్తున్నామని ప్రకటన చేసి, మళ్లీ చర్చలకు పిలవాలంటూ కార్మికులను మోసం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యావత్తు కార్మిక లోకాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కార్మికుల ఆత్మహత్యలకు, కార్మికుల కుటుంబాలు పడుతున్న ఇబ్బందులకు జేఏసీయే బాధ్యత వహించాలంటున్నారు.
బుధవారం(నవంబర్ 20,2019) అత్యవసరంగా భేటీ అయిన ఆర్టీసీ జేఏసీ.. సమ్మెపై సంచలన ప్రకటన చేసింది. సమ్మె విరమణకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. అయితే ప్రభుత్వానికి ఆర్టీసీ జేఏసీ ఓ కండీషన్ పెట్టింది. ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం కార్మికులను విధుల్లోకి తీసుకుంటేనే సమ్మె విరమిస్తామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చెప్పారు. విధుల్లో చేరిన కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని అన్నారు. సమ్మెకు ముందున్న పరిస్థితులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యలను లేబర్ కోర్టుకు ప్రభుత్వం సత్వరమే నివేదించాలన్నారు. ప్రభుత్వం ఆర్టీసీని ఓ ఆదర్శ ఉద్యోగ సంస్థగా చూడాలని హైకోర్టు సూచించిందని గుర్తు చేశారు.