హైదరాబాద్: డేటా వార్ తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. రెండు ప్రభుత్వాల మధ్య రాజకీయ రగడగా మారింది. చంద్రబాబు, కేటీఆర్ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది.
హైదరాబాద్: డేటా వార్ తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. రెండు ప్రభుత్వాల మధ్య రాజకీయ రగడగా మారింది. చంద్రబాబు, కేటీఆర్ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ ప్రభుత్వం దొంగిలించి దుర్వినియోగం చేస్తోందనే ఆరోపణలపై తెలంగాణ పోలీసులు విచారణ చేపట్టడం కలకలం రేపింది. ఏపీకి చెందిన కంపెనీలో తెలంగాణ పోలీసులు సోదాలు ఎలా చేస్తారని ఏపీ ప్రభుత్వం ఫైర్ అయ్యింది. దీంతో వివాదం మరింత ముదిరింది.
ఈ వివాదం హీట్ తగ్గక ముందే మరో కాంట్రవర్సీ వెలుగులోకి వచ్చింది. అదే ‘క్యాష్ ఫర్ ట్వీట్’. తెలంగాణ ప్రభుత్వంపై బురద చల్లేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నించినట్టు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధారాలతో సహా బయటపెట్టారు. డాటా చోరీ కేసులో తమ తప్పుని కప్పిపుచ్చుకునేందుకు, తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు, భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు 2 రోజలుగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సోషల్ మీడియాలో ప్రయత్నాలు చేస్తున్నట్టు టీఆర్‌ఎస్ అనుమానిస్తోంది. #TSGovtStealsData హ్యాష్‌ట్యాగ్‌లతో ట్విట్టర్‌లో టీఆర్ఎస్ ప్రభుత్వంపై చంద్రబాబు, లోకేష్ ఆదేశాల మేరకు ఎదురుదాడి జరుగుతున్నట్లు ఆధారాలు సేకరించారు.
ఏపీ, తెలంగాణలతో సంబంధంలేని ట్విట్టర్ అకౌంట్ల నుంచి వేల సంఖ్యలో డాటా చోరీ కేసుకు సంబంధించి ట్వీట్లు వచ్చాయని కేటీఆర్ చెప్పారు. అవననీ తెలంగాణ ప్రభుత్వాన్ని ముద్దాయిగా చూపేలా ఉన్నాయన్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్‌ల నుంచి తెలుగు పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్‌లను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు వెల్లువెత్తాయన్నారు. ముంబైకి చెందిన సంజయ్ బఫ్నా అనే వ్యక్తి ఓ ఇంగ్లీష్ పేపర్‌లో వచ్చిన న్యూస్ క్లిప్పింగ్‌ను ట్యాగ్ చేస్తూ ‘వాళ్లు విలువైన సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నం చేయడంతోపాటు ఐటీ సంస్థ ఉద్యోగులను కిడ్నాప్ చేసే చర్యలకు పాల్పడినందుకు సిగ్గుపడాలి’ అని ట్వీట్ చేశాడు.
ఇదే తరహాలో తెలంగాణ ప్రభుత్వాన్ని దోషిగా చూపే ప్రయత్నంలో ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు ట్వీట్ చేశారు. ‘మా నాయకుడితో పోరాడ లేకే.. మా అభివృద్దిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని ముంబైకి చెందిన సంతోష్ శుక్లా అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. బాలీవుడ్ చౌక్ పేరిట ‘మా ఆస్తులను దొంగిలించారు. మా నీళ్లను దొంగిలించారు. ఇప్పుడు మా డాటాను దొంగిలిస్తున్నారా? టీఆర్‌ఎస్ ప్రభుత్వం సిగ్గు పడాలి’ అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. మరికొంత మంది ఇదే అర్థం వచ్చేలా ట్వీట్లు, రీట్వీట్లు చేశారు.
ఐటీ గ్రిడ్ వ్యవహారంలో తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు, లోకేష్.. ‘క్యాష్ ఫర్ ట్వీట్’ కు తెరలేపినట్లు టీఆర్‌ఎస్ అనుమానిస్తోంది. డబ్బు ఇచ్చి తెలంగాణ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న తీరుని టీఆర్ఎస్ సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. ఈ ట్వీట్ల సంగతి ఏంటో చూడాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించింది. దీనిపై సైబర్ క్రైం విభాగంతో పాటు ట్విట్టర్‌కు ఫిర్యాదు చేశారు. ట్వీట్లు చేస్తున్న కొంతమందిని ఇప్పటికే గుర్తించిన ప్రభుత్వం.. వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను కోరింది. ఏపీ-తెలంగాణ మధ్య వ్యవహారంపై ముంబై, బెంగళూరు, పుణె, రాజస్థాన్ నుంచి ట్వీట్లు రావడంపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.