తెలంగాణ మంత్రుల శాఖలు ఇవే

  • Publish Date - February 19, 2019 / 02:16 PM IST

హైదరాబాద్: ఉత్కంఠ వీడింది. ఏ మంత్రికి ఏ శాఖ అన్నది తెలిసిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన మంత్రులకు సీఎం కేసీఆర్ శాఖలు కేటాయించారు. రాజ్‌భవన్ వేదికగా ఫిబ్రవరి 19వ తేదీ మంగళవారం ఉదయం మంత్రివర్గ విస్తరణ జరిగింది. 10మంది ఎమ్మెల్యేలతో గవర్నర్ నరసింహన్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు. కొత్త మంత్రులకు ఏ శాఖలు కేటాయిస్తారు అనేదానిపై ఉత్కంఠ నడిచింది. రాత్రి 7 గంటల తర్వాత మంత్రులకు కేటాయించిన శాఖలపై ప్రకటన వెలువడింది.

 

సీనియర్‌ నేత కొప్పుల ఈశ్వర్‌కు సంక్షేమశాఖ కేటాయించగా, మరో సీనియర్‌ నేత ఇంద్రకరణ్‌రెడ్డికి న్యాయ, అటవీ, దేవాదాయశాఖలు అలాట్‌ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన ఈటల రాజేందర్‌కు ఈసారి వైద్యారోగ్యశాఖ దక్కగా.. గతంలో విద్యుత్‌శాఖ మంత్రిగా వ్యవహరించిన జగదీశ్‌రెడ్డికి ఈసారి విద్యాశాఖ లభించింది. గత హయంలోనూ మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్‌కు పశుసంవర్థకశాఖ కేటాయించారు.

 

ఇక, తొలిసారి మంత్రి పదవి నిర్వహిస్తున్న వారిలో నిరంజన్‌రెడ్డికి వ్యవసాయ శాఖ, ఎర్రబెల్లి దయాకర్‌రావుకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు, ప్రశాంత్‌రెడ్డికి రోడ్లు-భవనాలు, రవాణాశాఖలు కేటాయించారు. మల్లారెడ్డికి కార్మిక శాఖ దక్కగా.. శ్రీనివాస్‌గౌడ్‌కు ఎక్సైజ్‌, పర్యాటక శాఖలు లభించాయి.

 

కీలకమైన ఆర్థిక, రెవెన్యూ, సాగునీటి పారుదల, ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి వంటి శాఖలను కేసీఆర్‌ తన వద్దే ఉంచుకున్నారు. గత హయాంలో కేసీఆర్ తనయుడు కేటీఆర్‌ ఐటీ, పట్టణాభివృద్ధి శాఖలను, హరీశ్‌రావు సాగునీటి పారుదల శాఖను నిర్వహించారు. కేబినెట్‌ విస్తరణలో భాగంగా 10మంది ఎమ్మెల్యేలకు కేసీఆర్ మంత్రి పదవులు ఇచ్చారు.

 

 

మంత్రులు, వారికి కేటాయించిన శాఖలు ఇవే…

నెంబర్ మంత్రులు శాఖలు
1 ఈటల రాజేందర్ వైద్య ఆరోగ్యం
2 వేముల ప్రశాంత్ రెడ్డి రవాణా, రోడ్లు భవనాలు
3 గుంటకండ్ల జగదీష్‌రెడ్డి విద్యాశాఖ
4 సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వ్యవసాయశాఖ
5 తలసాని శ్రీనివాస్‌యాదవ్ పశుసంవర్థకశాఖ
6 కొప్పుల ఈశ్వర్ సంక్షేమశాఖ
7 ఎర్రబెల్లి దయాకర్‌రావు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్
8 అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి న్యాయశాఖ, దేవాదాయ, అడవులు, పర్యావరణం
9 శ్రీనివాస్‌గౌడ్ ఎక్సైజ్, పర్యాటకం, క్రీడలు
10 చామకూర మల్లారెడ్డి కార్మిక, ఉపాధి, మానవవనరుల అభివృద్ధి