హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సర్కార్ తొలి కేబినెట్ సమావేశం ఫిబ్రవరి 21న జరగనుంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం సీఎం కేసీఆర్ సుదీర్ఘకాలం విరామం తీసుకున్న అనంతరం రెండు రోజుల క్రితం కేబినెట్‌ను విస్తరించారు. కొన్ని శాఖల కేటాయింపు కూడా పూర్తికావడంతో పూర్తి కేబినెట్ కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు భేటీ కానుంది. 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనుండడంతో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సాయంత్రం జరిగే సమావేశంలో కీలకమైన ఓటాన్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక శాఖను తనవద్దే అట్టేపెట్టుకోవడంతో అసెంబ్లీలో బడ్జెట్‌ను కూడా ఆయనే ప్రవేశపెట్టనున్నారని సమాచారం. అదేవిధంగా పంచాయతీరాజ్, జీఎస్టీ సవరణ బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలపనున్నుట్లు సమాచారం.