తమిళిసై ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు : రాజ్ భవన్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు

  • Publish Date - September 7, 2019 / 01:29 PM IST

రాష్ట్ర గవర్నర్‌గా డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. సెప్టెంబర్ 08వ తేదీ ఆదివారం ఉదయం 11.00 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. హైదరాబాద్‌కు తమిళిసై 8.30గంటలకు రానున్నారు. ఇదిలా ఉంటే..చెన్నైలో ఢిల్లీ తెలంగాణ భవన్ ప్రతినిధులు తమిళిసైని కలిశారు. రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరి, రాజ్ భవన్ ఏడీసీ కలిసిన వారిలో ఉన్నారు. ప్రమాణ స్వీకారం వివరాలను తెలియచేశారు. మరోవైపు రాజభవన్ సంయుక్త కార్యదర్శిగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ భవానీ శంకర్ నియమితులయ్యారు.

ప్రమాణ స్వీకారం సందర్భంగా రాజ్‌భవన్‌ రోడ్డులో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు ట్రాఫిక్‌ పోలీసులు. ఉదయం అధికారిక కార్యక్రమం ఉన్నందున దారి మళ్లించారు. మోనప్ప ఐలాండ్‌ రాజీవ్‌ గాంధీ విగ్రహం నుంచి విశ్వేశ్వరయ్య విగ్రహం జంక్షన్‌ వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయదారుల గుండా వెళ్లాలని అధికారులు సూచించారు. మోనప్ప ఐలాండ్‌ నుంచి వీవీ విగ్రహం వరకు ఆయా సమయాల్లో వాహనాలకు అనుమతి ఉండదన్నారు, 

మరోవైపు ప్రగతి భవన్‌లో గవర్నర్‌ నరసింహన్ వీడ్కోలు సభ జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం గవర్నర్ దంపతులు రాజ్ భవన్ చేరుకున్నారు. రాజ్ భవన్ సిబ్బందితో 9 ఏళ్ల అనుభవాలను ఓసారి గుర్తు చేసుకున్నారు. వారికి వీడ్కోలు పలికిన అనంతరం నరసింహన్‌ దంపతులు…బేగంపేట విమానాశ్రయానికి వెళ్లి అక్కడి నుంచి బెంగళూరుకు ప్రత్యేక విమానంలో వెళ్లారు. 
Read More : గవర్నర్ నరసింహన్‌కు వీడ్కోలు : సీఎం కేసీఆర్ భావోద్వేగం