Ponnam Prabhakar: తగ్గుతున్న మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్ ధరలు.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన!
ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి కామన్ పాస్ ధరలపై తెలంగాణ (Ponnam Prabhakar)ప్రభుత్వం పునఃసమీక్ష నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుంది.
- V Santhosh Kumar
- Published on- October 14, 2026 / 10:44 PM IST
Telangana govt to revise rtc metro common pass charges in hyderabad
Ponnam Prabhakar: భాగ్యనగరంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఇటీవల ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి కామన్ పాస్ ధరలపై తెలంగాణ ప్రభుత్వం పునఃసమీక్ష నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుంది. కామన్ పాస్ చార్జీలు సాధారణ ప్రజలకు, నిత్యం ప్రయాణించే ఉద్యోగులకు తీవ్ర భారంగా పరిణమించాయంటూ ప్రయాణికుల నుంచి విస్తృత స్థాయిలో ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. ప్రజారవాణాను ప్రోత్సహించడమే లక్ష్యంగా తెచ్చిన ఈ పథకం వల్ల సామాన్యులకు ఆర్థిక వెసులుబాటు కలగాలనే ఉద్దేశంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచన మేరకు ఈ సమీక్షను చేపడుతున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) తెలిపారు.
అందుబాటులో లేని కామన్ పాస్ ధరలు.. ప్రయాణికుల నుంచి అసంతృప్తి:
ప్రస్తుతం అమలులో ఉన్న ధరల ప్రకారం రోజువారీ కామన్ పాస్ రూ. 400 గా నిర్ణయించారు. ఇందులో మెట్రో వాటా రూ. 300 కాగా ఆర్టీసీ వాటా రూ. 100 గా ఉంది. అదేవిధంగా నెలవారీ పాస్ ధరను ఏకంగా రూ. 8,500 గా నిర్ణయించి (మెట్రోకు రూ. 7,000, ఆర్టీసీకి రూ. 1,500) నిర్ణయించారు. ఈ భారీ ధరల కారణంగా సాధారణ టికెట్ కంటే పాస్ ధరలే ఎక్కువగా ఉన్నాయన్న విమర్శలు రావడం, ప్రజాభిప్రాయం ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావడంతో చార్జీలను తగ్గించడం తప్పనిసరైంది.
ప్రయాణికులపై అదనపు భారం ఉండదు.. మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ:
ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడమే తమ ప్రధాన ధ్యేయమని, ప్రజలపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం మోపడం ప్రభుత్వ ఉద్దేశం కాదని మంత్రి స్పష్టం చేశారు. త్వరలోనే సంబంధిత రవాణా శాఖ, మెట్రో అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ప్రయాణికుల ఆర్థిక పరిస్థితులను, అవసరాలను పరిగణనలోకి తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. అందరికీ అందుబాటులో ఉండే సరసమైన ధరల్లో కొత్త చార్జీలను త్వరలోనే ఖరారు చేస్తామని భరోసా ఇచ్చారు.
