హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 22 శుక్రవారం సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు సమావేశాలు జరుగనున్నాయి. ఈసారి ముఖ్యమంత్రి కేసీఆరే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కేబినెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. గత నాలుగేళ్లుగా రాష్ట్ర ఆదాయం పెరుగుతున్న నేపథ్యంలో బడ్జెట్ రెండు లక్షల కోట్ల రూపాయలు దాటుతుందని అంచనా వేస్తున్నారు. అసెంబ్లీలో కేసీఆర్ బడ్జెట్ ప్రవేశ పెట్టనుండగా మండలిలో ఈటల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
ఉదయం 11.30 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. సమావేశం ప్రారంభం అయిన వెంటనే పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. సభ వీర జవాన్లకు సంతాపం తెలుపనుంది. ఆ తర్వాత తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ చట్టంలో సవరణలతో కూడిన ఆర్డినెన్స్ ప్రవేశపెట్టనున్నారు.
మధ్యాహ్నం 12 గంటలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆర్థికశాఖను ఎవరికీ కేటాయించకపోవడంతో ముఖ్యమంత్రి కేసీఆరే శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెడతారు. కానీ సీఎం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుండటం తెలంగాణలో ఇదే తొలిసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రులుగా పని చేసిన కాసు బ్రహ్మానందరెడ్డి, కొణిజేటి రోశయ్య ఆర్థికశాఖ బాధ్యతలను స్వయంగా పర్యవేక్షించడంతో బడ్జెెెెట్ ప్రవేశపెట్టారు. 1964 నుంచి 1971 వరకు ముఖ్యమంత్రిగా పని చేసిన కాసు బ్రహ్మానందరెడ్డి తన పదవీకాలంలో ఒకసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కొణిజేటి రోశయ్య 2010-11 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
శాసన మండలిలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ లక్షా 74 వేల కోట్లు ఉండగా.. ఈసారి రెండు లక్షల కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. గత నాలుగేళ్లలో రాష్ట్ర సొంత రాబడులు, పన్నేతర ఆదాయం బాగా పెరుగుతున్న నేపథ్యంలో.. బడ్జెట్ కూడా అదేస్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ఇక ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో పెద్ద పద్దులన్నింటినీ సమగ్రంగా చేర్చినట్లు సమాచారం. ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు సంబంధించిన మొత్తాలను బడ్జెట్‌లో చేర్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుసార్లు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించిన కేసీఆర్.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో అవసరమైన నిధుల వివరాలను పొందుపర్చాలని సూచించారు. పేరుకు తాత్కాలిక బడ్జెట్ అయినా.. పెద్దపద్దులతో పూర్తిస్థాయి వివరాలతో బడ్జెట్‌కు తుది రూపమిచ్చినట్లు సమాచారం.
ఇప్పటివరకు పెన్షన్ల కోసం ప్రభుత్వం ఏటా 5,043 కోట్లు చెల్లిస్తోంది. అయితే ఏప్రిల్ నుంచి పింఛన్లు పెంచుతున్నట్లు ప్రకటించడంతో ప్రభుత్వంపై మరో 5 వేల కోట్ల భారం పడనుంది. దీనిని కూడా ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో కేటాయించనుంది. రైతుబంధు పథకం కింద ఇప్పటివరకు ఒక ఎకరం భూమికి రెండు పంటలకు కలిపి ఏడాదికి 8 వేల రూపాయలు సాయం ఇచ్చింది. ఈ ఏడాది నుంచి ఆ సాయం ఎకరానికి 10 వేల రూపాయలకు పెంచాలని నిర్ణయించింది. ఇందుకోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో 15 వేల కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అలాగే రైతు బీమాకు 1500 కోట్లు, వైద్య ఆరోగ్యశాఖకు 10 వేల కోట్లు, బీసీలకు 5 వేల కోట్ల నుంచి 6 వేల కోట్లు, ఎస్సీలకు 16 వేల కోట్లు, ఎస్టీలకు 9 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించే అవకాశం ఉంది.
ఓట్ ఆన్ అకౌంట్‌కు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ఫిబ్రవరి 21 గురువారం సాయంత్రం తొలిసారి భేటీ అయిన కేబినెట్.. బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలనుసారం రిజర్వేషన్లలో 50శాతం మించి ఉండరాదన్న దానికి అనుగుణంగా చట్ట సవరణ చేయాల్సి ఉంది. ఈ బిల్లును గత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాల్సి ఉండగా వాయిదా పడింది. ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఈ చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. శనివారం బడ్జెట్‌పై సభలో చర్చ జరుగనుంది. ఆదివారం సభకు సెలవు ప్రకటించడంతో.. సోమవారం బడ్జెట్‌కు శాసనసభ ఆమోద ముద్ర వేయనుంది.
Read Also: ఇదీ లెక్క : తెలంగాణ బడ్జెట్ రూ.2 లక్షల కోట్లు
Read Also: తెలంగాణ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం
Read Also: ఒక్కో అమరవీరుడి కుటుంబానికి రూ.25లక్షల సాయం : సీఎం కేసీఆర్
Read Also: బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేసీఆర్