గోల్డ్ షాప్ లో చోరీ : పెప్పర్ స్ప్రే చల్లి రూ.30లక్షలు దోచేసిన దొంగలు

  • Publish Date - November 13, 2019 / 05:44 AM IST

సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో  భారీ చోరీ జరిగింది.  మంగళవారం (నవంబర్ 12) జరిగిన ఈ చోరీలో  బంగారం షాపు ఉద్యోగిపై  పెప్పర్ స్ప్రే చల్లి రూ.30లక్షలు నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీంట్లో భాగంగా ఆ ప్రాంతంలోని సీసీ పుటేజ్ ను పరిశీలించిన పోలీసులు దొంగలు బంగారం షాపు ఉద్యోగిపై స్ప్రే చల్లి చోరీ చేసిన బైక్ పై పరారవ్వటాన్ని గుర్తించారు. 
 
సికింద్రాబాద్ లోని  జనరల్ బజార్ ప్రాంతంలో రోహిత్, నవకార్ జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి. రోహిత్ దుకాణంలో నగలు తయారుచేస్తుంటారు. వాటిని నవకార్ జ్యువెలరీ షాపు కొనుగోలు చేస్తుంటుంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి గత లావాదేవీలకు సంబంధించి నవకార్ జ్యువెలరీ వారికి ఇవ్వాల్సిన డబ్బును రోహిత్ జ్యువెలరీ షాపు యాజమాన్యం రూపారామ్ అనే వ్యక్తికి ఇచ్చి పంపించింది.
రూపారామ్ ఆ డబ్బు సంచితో నవకార్ జ్యువెలరీ షాపు సెల్లార్ వద్దకు చేరుకోగానే.. అక్కడే ఉన్న కొంతమంది దుండగులు అతనిపై పెప్పర్ స్ప్రే చల్లి డబ్బుతో ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవి ఫుటేజీలో దొంగలను గుర్తించి వారిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.