అంతన్నాడన్నాడింతన్నాడు..శ్రీవారి సన్నిధిలో అభిషేకం చేయిస్తానన్నాడు..సన్మానం చేయిస్తానన్నాడు…లక్షలు దోచేశాడు..తరువాత ఇంకేముంది..
తిరుమల : అంతన్నాడన్నాడింతన్నాడు..శ్రీవారి సన్నిధిలో అభిషేకం చేయిస్తానన్నాడు..సన్మానం చేయిస్తానన్నాడు…లక్షలు దోచేశాడు..తరువాత ఇంకేముంది..వెంకన్న పేరుతో మోసాలు..లబోదిబోమంటున్న భక్తులు..సన్మానం చేయిస్తానంటు నమ్మించాడు..అపై రూ.20 లక్షలకు ముంచేశాడు. తిరుమల వెంకన్నను దగ్గరగా వెళ్లి దర్శించుకోవాలని భక్తులు తహతహలాడుతుంటారు. అందుకోసం డబ్బులకు కూడా లెక్కచేయకుండా శ్రీవారిని దర్శించుకోవాలనే ఆలోచనతో మోసాలబారిన పడుతుంటారు. భక్తుల్లో వున్న ఆ సెంటిమెంట్ ను ఆసరా చేసుకున్న కేటుగాళ్లు అందినకాడికి డబ్బులు దండుకుంటుంటారు.
ఈ క్రమంలో తిరుమల వెంకన్న పేరుతో రూ. 20 లక్షలు దోచేసాడు ఓ కేటుగాడు. నెల్లూరు ప్రాంతానికి చెందిన ఆనం రాజ్ కుమార్ రెడ్డి..సులువుగా డబ్బు సంపాదించాలన్న ఆశతో తిరుమల శ్రీవారి భక్తులను ఎంచుకున్నాడు. తనకు తిరుమలలో చాలా పరపతి ఉందని..స్వామికి అభిషేకం టికెట్లు ఇప్పించటంతోపాటు శేషవస్త్రంతో సన్మానం చేయిస్తానని కొంతమందిని నమ్మించాడు. అభిషేకం కోసం రూ. 2500, శేషవస్త్ర సన్మానం కోసం రూ. 50 వేలు అవుతుందని నమ్మించి రూ.2లక్షలు సేకరించాడు. ఈ క్రమంలో సుకుమార్ రెడ్డి అనే వ్యక్తి నమ్మి డబ్బిచ్చాడు. ఇలాగే మరికొందరిని నమ్మించిన రాజ్ కుమార్ రూ.20లక్ష సేకరించాడు. రాజ్ కుమార్ చెప్పిన డేట్ వచ్చినా శ్రీవారి అభిషేకం టిక్కెట్స్ ఇవ్వకపోవటంతో డబ్బిచ్చినవారు నిలదీశారు. సరైన సమాధానం రాకపోవటంతో అనుమానించిన సదరు బాధితులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ కేసును నమోదు చేసుకున్న పోలీసులు రాజ్ కుమార్ ను అరెస్ట్ చేసి..విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.