ఆర్టీసీ జేఏసీ చలో ట్యాంక్ బండ్ నేపథ్యంలో పోలీసు శాఖ అలర్ట్ అయింది. నవంబర్ 9న ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఆర్టీసీ జేఏసీ చలో ట్యాంక్ బండ్ నేపథ్యంలో పోలీసు శాఖ అలర్ట్ అయింది. నవంబర్ 9న ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాకపోకలు బంద్ చేశారు. ట్యాంక్ బండ్ వైపు వెళ్లే రూట్లను వేరే మార్గాలకు మళ్లించారు.
సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను కవాడిగూడ వైపు మళ్లించారు. క్రాస్ రోడ్డు నుంచి ఇందిరాపార్క్ వైపు వెళ్లే వాహనాలను అశోక్ నగర్ నుంచి మళ్లించారు. హిమాయత్ నగర్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను బషీర్ బాగ్ వైపు మళ్లించారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వచ్చే వాహనాలను పీసీఆర్ జంక్షన్ దగ్గర మళ్లించారు.
ఖైరతాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను ఇందిరా గాంధీ విగ్రహం దగ్గర నెక్లెస్ రోడ్డు అండ్ మింట్ కాంపౌండ్ వైపు మళ్లించారు. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా వాహనదారులు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ఆర్టీసీ జేఏసీ నేతలు శనివారం (నవంబర్ 9, 2019) తలపెట్టిన సకల జనుల సామూహిక దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సామూహిక దీక్షకు అనుమతి ఇవ్వలేమని సీపీ అంజనీకుమార్ ఖరాఖండిగా చెప్పారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్యాంక్ బండ్ వైపు ఎవరొచ్చినా అరెస్టు చేస్తామన్నారు.
అఖిల పక్ష నేతలు కోదండరామ్, ఎల్.రమణ, తమ్మినేని వీరభద్రం, చాడా వెంకట్ రెడ్డి, నారాయణ నేతృత్వంలోని కొందరు అఖిలపక్ష నేతలు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను కలిసి అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే సామూహిక దీక్షకు సీపీ అనుమతి నిరాకరించారు. రేపు ఎవరైనా ట్యాంక్ బండ్ వచ్చినా, చట్టాన్ని తమ చేతిలోకి తీసుకేంటే వారందరినీ అదపులోకి తీసుకుంటామన్నారు. కచ్చితంగా అరెస్టు ఉంటాయని చెప్పి సూచనప్రాయంగా చెప్పారు.