తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని విద్యానగర్‌లో ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రేపు చలో ట్యాంక్‌బండ్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. దీనికి అఖిలపక్ష నేతలు మద్దతు తెలిపారు. మరోవైపు చలో ట్యాంక్‌బండ్‌కు అనుమతి లేదన్న పోలీసులు.. ఆర్టీసీ జేఏసీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు రాజిరెడ్డి. ప్రభుత్వం తమ కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకుంటే.. కోర్టు నుంచి అనుమతి తెచ్చుకుంటామన్నారు. ఇప్పటికైనా సర్కార్ తమను చర్చలకు ఆహ్వానించాలన్నారు.
ఆర్టీసీ జేఏసీ నేతలు శనివారం (నవంబర్ 9, 2019) తలపెట్టిన సకల జనుల సామూహిక దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సామూహిక దీక్షకు అనుమతి ఇవ్వలేమని సీపీ అంజనీకుమార్ ఖరాఖండిగా చెప్పారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్యాంక్ బండ్ వైపు ఎవరొచ్చినా అరెస్టు చేస్తామన్నారు.
దీనికి సంబంధించి కొన్ని రోజులుగా ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతం అవుతుంది. నేటితో ఆర్టీసీ సమ్మె 35వ రోజుకు చేరుకుంది. రేపు సామూహిక దీక్షలకు ట్యాంక్ బండ్ కు రావాలని అఖిల పక్ష నేతలు పిలుపు ఇచ్చిన క్రమంలో దానికి పర్మీషన్ కోసం శుక్రవారం (నవంబర్ 8, 2019) బషీర్ బాగ్ లోని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను అఖిల పక్ష నేతలు కలిశారు. అయితే దీక్షకు అనుమతి లేదని సీపీ వారికి స్పష్టంగా చెప్పారు.
ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికులను పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారు. అయితే ఇవి అక్రమ అరెస్ట్‌లని .. జేఏసీ నేతలు ఖండిస్తున్నారు. ఇప్పటి వరకూ దాదాపు వంద మంది కార్మికులను అరెస్ట్ చేశారని జేఏసీ నేతలు మండిపడుతున్నారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.