తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజూ కంటిన్యూ అవుతోంది. ఉద్యోగులపై వేటు వేస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించినా.. ఆర్టీసీ కార్మికులు వెనక్కితగ్గడం లేదు. సమ్మెపై ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్ధామ రెడ్డి మాట్లాడారు. ఉద్యోగులను డిస్మిస్ చేస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనలకు భయపడేది లేదని స్పష్టం చేశారు. సమ్మె చేస్తున్న వారిలో నలుగురిని కూడా డిస్మిస్ చేసే పరిస్థితి లేదన్నారు. ఉద్యమాలతో సీఎం అయిన కేసీఆర్.. ఇప్పుడు ఉద్యమాలనే అణచివేస్తున్నారని వాపోయారు. ఆర్టీసీ ఉద్యోగులకు రూ.50వేల వేతనం అంటూ సీఎం కేసీఆర్ అబద్దపు ప్రచారం చేస్తున్నారని అశ్వద్ధామ రెడ్డి మండిపడ్డారు.
ఆర్టీసీ సమ్మె విజయవంతంగా కొనసాగుతోందని ఆయన చెప్పారు. తాము న్యాయ సలహా తీసుకున్నామని.. ఆర్టీసీ సమ్మె చట్టబద్దమే అని వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగులు కేసీఆర్ ఫాంహౌస్ లో పని చేసే పాలేర్లు కాదని, ఉద్యోగులను తొలగించడం అంత సులభం కాదని అశ్వద్ధామరెడ్డి అన్నారు. తెలంగాణ ఆర్టీసీని ఏపీ ఆర్టీసీతో పోల్చాలని.. ఇతర రాష్ట్రాలతో కాదని సూచించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేవరకు సమ్మె విరమించేది లేదని అశ్వద్ధామ రెడ్డి తేల్చి చెప్పారు. సమ్మెకి సంబంధించి ఎల్లుంటి భవిష్యత్ కార్యాచారణ ప్రకటిస్తామన్నారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. సమ్మె చట్ట విరుద్ధం అన్నారు. ఆర్టీసీలో కొత్త సిబ్బంది నియామకాలు చేపట్టాలని, ప్రభుత్వం విధించిన గడువులోపు విధులకు హాజరు కాని సిబ్బందిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకొనే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆర్టీసీలో 1200 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీని విలీనం చేసే ప్రసక్తే లేదని..కార్మిక సంఘాలతో చర్చలు జరిపేది లేదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్. అక్టోబర్ 5 నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకి దిగిన విషయం విదితమే.