తెలంగాణ ప్రభుత్వంపై పోరులో వెనక్కు తగ్గేది లేదంటోంది ఆర్టీసీ కార్మిక జేఏసీ. శనివారం(అక్టోబర్ 19,2019) రాష్ట్ర బంద్ పాటించిన కార్మికులు.. ఆదివారం(అక్టోబర్ 20,2019) నుంచి
తెలంగాణ ప్రభుత్వంపై పోరులో వెనక్కు తగ్గేది లేదంటోంది ఆర్టీసీ కార్మిక జేఏసీ. శనివారం(అక్టోబర్ 19,2019) రాష్ట్ర బంద్ పాటించిన కార్మికులు.. ఆదివారం(అక్టోబర్ 20,2019) నుంచి తమ పోరాటాన్ని ఉధృతం చేయనున్నారు. ఇవాళ రాజకీయ పార్టీల నేతలను కలవడంతో పాటు.. తమ ఆందోళనకు ప్రజల మద్దతు కూడగట్టనున్నారు. అన్ని చౌరస్తాల్లో ప్రజలకు పువ్వులిచ్చి మద్దతు కోరనున్నారు.
తమ డిమాండ్లు సాధించే వరకు ఆందోళన విరమించేది లేదని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు అంటున్నారు. తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు ప్రకటించారు. శనివారం సాయంత్రం రాష్ట్ర బంద్ ముగిసిన తర్వాత ఆర్టీసీ జేఏసీ నాయకులు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రాష్ట్ర బంద్ ఇచ్చిన ఉత్సాహంతో.. భవిష్యత్ కార్యాచరణ రూపొందించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు రాజకీయ పార్టీల నేతలను కలవాలని ఆర్టీసీ జేఏసీ నేతలు నిర్ణయించారు. అలాగే, ఎంఐఎం నేతలనూ కలవాలని నిశ్చయించారు. అక్టోబర్ 23న ఉస్మానియా యూనివర్సీటీలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని జేఏసీ తీర్మానించింది. బంద్ సందర్భంగా గాయపడ్డ పోటు రంగారావుని ఆర్టీసీ జేఏసీ నేతలు కలిసి పరామర్శించనున్నారు.
తెలంగాణ ఉద్యమం తరువాత జరిగిన ఉద్యమాల్లో ఇదే పెద్ద ఉద్యమమన్నారు ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి. నేడు అన్ని చౌరస్తాల్లో పువ్వులు ఇచ్చి ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరతామని చెప్పారు. ఆర్టీసీని రక్షించండి అనే నినాదంతో ప్రజల్లోకి వెళతామన్నారు. మరోసారి గవర్నర్‌ను కలుస్తామన్న ఆయన.. రాజకీయ పార్టీ నేతలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. కార్మికులను తొలగించడం.. సరైన నిర్ణయం కాదన్నారు.
శనివారం రాష్ట వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి. అన్ని బస్ డిపోల దగ్గర ఆందోళనలు కొనసాగాయి. కార్మికులు, రాజకీయ నేతలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం దిగొచ్చి.. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.