ఆర్టీసీ సమ్మె 42వ రోజు : సమ్మెపై సర్కార్ దృష్టి

  • Publish Date - November 15, 2019 / 08:46 AM IST

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె సుదీర్ఘంగా సాగుతోంది. 2019, నవంబర్ 15వ తేదీ శుక్రవారానికి 42వ రోజుకు చేరుకుంది. మొదటి నుంచి కార్మికులు ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేస్తూనే ఉన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని, ఆర్టీసీని రక్షించాలని కోరుతున్నారు. ప్రభుత్వం కూడా రెండూ మూడు సార్లు హైకోర్టు ఆదేశాల మేరకు చర్చలు జరిపినా సమ్మె పరిష్కారం కాలేదు. దీంతో కార్మికులు సమ్మెను మరింత ఉధృతం చేస్తున్నారు. నిరసనలతో హోరెత్తిస్తున్నారు. నిరసనల్లో భాగంగా శుక్రవారం ఆర్టీసీ కార్మికులు.. రాష్ట్ర వ్యాప్తంగా బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. 

మరోవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌పై కార్మిక సంఘాల వెనక్కి తగ్గాయి. ఆ డిమాండ్‌ను  తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి గురువారం ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యత అంటున్న జేఏసీ నేతలు.. మిగతా 25 డిమాండ్లపై ప్రభుత్వం చర్చలు జరపాల్సిందే అంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇన్ని అరెస్టులు జరగలేదన్నారు. అరెస్టు చేసిన ఆర్టీసీ నేతలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.  

సీఎం కేసీఆర్ కూడా ఆర్టీసీ సమ్మెపై సీరియస్‌గానే దృష్టిపెట్టారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలపై అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు. అలాగే.. హైకోర్టులో ఎలాంటి వాదనలు వినిపించాలనే విషయంపైనా అధికారులకు సూచనలు చేస్తున్నారు. కార్మికులు విలీనం డిమాండ్‌ను పక్కనబెట్టడంతో.. ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది అనే విషయం ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. 
Read More : చర్చలకు పిలవండి : ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణ