TV9 సీఈవోగా రవిప్రకాష్ ను తొలగిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఓ కీలక ఉద్యోగి సంతకాన్ని ఫోర్జరీ చేసే స్థాయికి దిగజారిన Tv9 సీఈవో రవిప్రకాశ్‌ను.. ఆ సంస్థ సీఈవో పదవి నుంచి తొలగించాలని Tv9 యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. టీవీ ఛానల్ నిర్వహణ తన ఇష్టారాజ్యంగా జరగాలన్న పంతంతోనే.. కొత్త యాజమాన్యానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని అంటోంది యాజమాన్యం.
కంపెనీలో 90 శాతానికి పైగా వాటా ఉన్న కొత్త యాజమాన్యానికి.. ఆ కంపెనీ నిర్వహణలో అడుగడుగునా అడ్డుపడుతూ, కంపెనీల చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని కొత్త యాజమాన్యం ఆరోపించింది. మెజార్టీ వాటాదారుల హక్కులను అణగదొక్కే విధంగా కుట్రపూరిత చర్యలకు పాల్పడ్డారంటోంది అలందా మీడియా.
సంస్థ నిర్వహణకు సంబంధించి రవిప్రకాశ్ పాల్పడిన అక్రమాలపై Tv9 యాజమాన్యం అతనిపై చీటింగ్ కేసు పెట్టింది.
సంస్థకు హాని కలిగించే ఉద్దేశంతో కొందరు వ్యక్తులతో కుమ్మక్కై ఫోర్జరీ పత్రాలు సృష్టించడమే కాక, కంపెనీ నిర్వహణలో యాజమాన్యానికి ఇబ్బందులు కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నారని Tv9 యాజమాన్యం పోలీసులకు ఇచ్చిన కంప్లయింట్ లో స్పష్టం చేసింది.