2020-21 బడ్జెట్‌పై కేంద్రం కసరత్తులు: తెలంగాణ పథకాలకు నిధులివ్వాలని కోరిన హరీశ్ రావు  

  • Publish Date - December 18, 2019 / 09:37 AM IST

2020-21 వార్షిక బడ్జెట్ పై కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తులు ప్రారంభించింది. ఈమేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సంప్రదిపులపై అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశమయ్యారు.  తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రాల సాధికారతను పెంచేలా కేటాయింపులు ఉండాలని సూచించారు. నీతి ఆయోగ్ సూచనల మేరకు కేంద్ర బడ్జెట్  లో తెలంగాణ పథకాలకు నిధులు కేటాయించాలని కేంద్రాన్ని మంత్రి హరీశ్ రావు కోరారు. 
   
దీంట్లో భాగంగా మూడేళ్ల కాలవ్యవధికి తెలంగాణలో చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి రూ.19 వేల 205 కోట్లు..మిషన్ కాకతీయకు రూ.5వేల కోట్లు  ఇవ్వాలని కోరారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు రూ.450 కోట్లు నిధులను విడుదల చేయాలని కోరారు. ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ఇంటిగ్రేడెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనీ..కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు కేంద్రం ఆర్థిక సహకారాన్ని అందించాలని కోరారు.   

జీఎస్టీ, ఏజీఎస్టీ, బకాయిల చెల్లింపులతో రాష్ట్రాలకు ఊతమిచ్చేలా నిధుల కేటాయింపులు ఉండాలన్నారు. ట్యాక్స్ చెల్లింపుల కోసం ఆమ్నెస్టీ పథకం తీసుకురావాల్సిన అవసరం ఉందని..జాతీయ ఉఫాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని  కేంద్రానికి మంత్రి హరీశ్ రావు సూచించారు.