తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం
తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అరేబియా సముద్రంలో కొనసాగుతున్న మహా తుఫాన్ తీవ్ర తుఫాన్ గా మారే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. దీని ప్రభావంతో బంగాళాఖాతం ప్రాంతంలోని గాలులు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మీదుగా అరేబియా సముద్రం వైపు వెళ్తున్నాయని, ఈ కారణంగా వానలు కురుస్తాయన్నారు. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో పలు చోట్ల వానలు పడ్డాయి. గరిష్టంగా మంచిర్యాల జిల్లా దండేపల్లిలో 10 సెమీ వర్షపాతం నమోదైంది.
ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో అత్యధికంగా 72.5మిల్లీమీటర్లు, తిరుమలలో 72 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయవాడ, గుంటూరు నగరాల్లో భారీవర్షం కురిసింది. ఈ వర్షాలు పత్తి పైరుకి తీవ్రనష్టం కలిగిస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మినుము, పెసర, కూరగాయ పంటలూ దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు.
దక్షిణాది రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఐఎండీ హెచ్చరికలతో కేరళలోని సుమారు 10 జిల్లాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే తమిళనాడును భారీ వర్షాలు వణికిస్తున్నాయి.