అందరికీ అందాలని: ప్రసాదాల తయారీకి మెషీన్లు

యాదాద్రికి లడ్డూ ప్రసాదాల తయారీ యంత్రాలు చేరుకున్నాయి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి దేవస్థానం పునర్నిర్మాణంలో భాగంగా ప్రసాదాల తయారీ, విక్రయశాల ఒకేచోట ఉండేలా నాలుగంతస్థుల భవనం నిర్మించారు. 

యాదాద్రి దేవస్థానానికి ఏడాదికి రూ.వంద కోట్ల ఆదాయముంటే అందులో సగం ప్రసాదాలపైనే వస్తోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రసాదాలను అందించలేకపోతున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో తయారీ యంత్రాలకు రూ.5కోట్లు కేటాయించారు. ప్రసాదాల తయారీ కోసం ప్రత్యేకంగా నాలుగంతస్తుల భవనం నిర్మించారు. 

కింది అంతస్తు నుంచి పై అంతస్తు వరకూ అంతా యంత్రాలే పనిచేస్తాయి. ప్రసాదాల భవనంలోని ప్రతి నిర్మాణం జర్మనీ, ఇతర దేశాల టెక్నాలజీతో చేపడుతున్నట్లు కూలీలు తెలిపారు. ఈ యంత్రాలతో రోజూ లక్ష లడ్డూలను తయారుచేయొచ్చని అధికారులు తెలిపారు. యంత్రాలతో ప్రసాదాలను తయారుచేసే పద్ధతి తెలుగు రాష్ట్రాల్లోనే మొదటిది కావడం విశేషం.