హైదరాబాద్: వైసీపీ చీఫ్ జగన్ సోదరి, ఆ పార్టీ నేత వైఎస్ షర్మిల పోలీసులను ఆశ్రయించారు. టీడీపీ కార్యకర్తలపై సీపీకి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై అసభ్యకర పోస్టింగ్స్, వ్యక్తిగత కామెంట్లు పెడుతున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వల్గర్ పోస్టులు పెడుతున్న వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ విషయమై భర్త అనిల్, పార్టీ సీనియర్ నేతలతో కలిసి షర్మిల సీపీ ఆఫీస్‌కి వెళ్లి కంప్లైంట్ చేశారు. అసభ్యకర పోస్టింగ్స్ పెడుతున్న వారిని గుర్తించి శిక్షించాలన్నారు. గతంలో కూడా షర్మిల గురించి సోషల్ మీడియాలో ఇలానే అసభ్యకర పోస్టులు పెట్టారు.
ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. పార్టీల నాయకులు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు వ్యూహలు రచిస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో కామెంట్ల కలకలం చెలరేగింది. కార్యకర్తలు, అభిమానులు హద్దులు మీరుతున్నారు. ప్రత్యర్థులపై అసభ్యకర, అనుచిత కామెంట్లు చేస్తున్నారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి పోస్టులు పెడుతున్నారు. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఈ విషయంలో శ్రుతి మించిపోయారని, పర్సనల్‌గా తనను టార్గెట్ చేస్తున్నారని వైఎస్ షర్మిల సీరియస్ అయ్యారు.