Heavy rains : తెలంగాణలో 3 రోజులుగా కురుస్తున్న భారీవర్షాలు… విద్యాసంస్థలకు సెలవులు

హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. గడచిన మూడు రోజులుగా హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షంతో వరదనీరు లోతట్టుప్రాంతాలను ముంచెత్తింది.

Heavy rains in Telangana : హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. గడచిన మూడు రోజులుగా హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షంతో వరదనీరు లోతట్టుప్రాంతాలను ముంచెత్తింది. మొన్న, నిన్న జల్లుల పడగా బుధవారం రాత్రి నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. (Heavy rains in Telangana) వర్షం కారణంగా నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా చిరు వ్యాపారులు ఉద్యోగాల కోసం బయటకు వచ్చిన ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వర్షపునీరు ప్రవహిస్తుండటంతో ట్రాఫిక్ మెల్లగా సాగుతోంది.

హైదరాబాద్  నగరంలోనూ భారీవర్షాలు

నగరంలోని కొన్ని ప్రధానమైన జంక్షన్ లలో ట్రాఫిక్ స్తంభించి పోయింది. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అత్యధికంగా మియాపూర్ ప్రాంతంలో 7.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. టోలిచౌకిలో 6.6 సెంటీమీటర్లు, కూకట్ పల్లిలో 5.6, మాదా పూర్ లో 5 సెంటిమీటర్లు, బాలాజీ నగర్ లో 4.9 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అయింది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఒక సెంటీమీటర్ వరకు వర్షం కురిసింది.

వాతావరణ శాఖ హెచ్చరికల జారీ

తెలంగాణలో గురు, శుక్రవారాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ (Imd) ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మంచిర్యాల, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి కొమురం భీం ఆసిఫాబాద్, యాదాద్రి భువనగిరి,నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నందున ఐఎండీ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

నేడు, రేపు విద్యాసంస్థలకు సెలవులు

ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం, శుక్రవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు.

ఏకధాటిగా భారీవర్షం 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి ఏకధాటిగా భారీ వర్షం కురుస్తోంది. భారీగా కురిసిన వర్షానికి భద్రాచలంలోని రామాలయం వద్ద గల పడమర మెట్లకు అన్నదాన సత్రం వద్దకు వర్షపు నీరు చేరాయి. రామాలయం పడమర మెట్లు ఎదురుగా గల అన్నదాన సత్రం ఎదురుగా గల బొమ్మల దుకాణాలన్నీ వర్షపు నీటికి మునిగాయి.

భద్రాచలంలో నిలచిన వరదనీరు

భద్రాచలం పట్టణం నుంచి వచ్చిన వర్షపు నీరంతా రామాలయం ఏరియా వద్ద గల కరకట్ట వద్ద ఉన్న స్లూయిజ్ ల నుంచి గోదావరి లోనికి కలుస్తోంది. గోదావరి వరద పెరగడంతో అధికారులు స్లుయిజులను మూసివేశారు.భద్రాచలం పట్టణం నుంచి వచ్చిన వర్షపు నీటిని మోటార్ల ద్వారా బయటకు తోడుతున్నారు. సరైన మోటార్లు ఏర్పాటు చేయకపోవడం వల్లనే వర్షపు నీరంతా దుకాణాల వద్దకు చేరి దుకాణాలన్నీ మునిగిపోయాయని దుకాణాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రామాలయం వద్ద భక్తుల అవస్థలు

వర్షపు నీరు రామాలయం ఏరియాలో చేరడంతో రామాలయానికి వచ్చే భక్తులు ఆలయానికి వెళ్లడానికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు అన్నదాన సత్రం వైపుకు వరద నీరు చేరడం వల్ల భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తం మీద తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అతలాకుతలమైంది.

ట్రెండింగ్ వార్తలు