Anju-Nasrullah Love Story
Anju-Nasrullah Love Story : భారతీయ వివాహిత అంజూ పాకిస్థాన్ దేశానికి వెళ్లడంలో ఎలాంటి ప్రేమ బాగోతం లేదని ఆమె తండ్రి చెబుతున్నా, తాజాగా వెలుగుచూసిన అంజూ వ్యాఖ్యలు దీనికి విరుద్ధంగా ఉన్నాయి. ప్రియుడి కోసం భారత దేశ సరిహద్దులు దాటి పాకిస్థాన్ దేశానికి వచ్చిన అంజూ తాను ప్రేమించిన పాక్ యువకుడు నస్రుల్లాతో నిశ్చితార్థం చేసుకున్నాకే భారత్ తిరిగి వెళతానని చెప్పడం సంచలనం రేపింది. (Anju-Nasrullah Love Story)
పాక్ యువకుడిని పెళ్లి చేసుకున్నా, మతం మారను…
ఖైబర్ పఖ్తుంఖ్వాలోని దీర్ బాలా జిల్లాకు వచ్చిన అంజూ తాను నస్రుల్లాను పెళ్లి చేసుకున్నా ఇస్లాం మతంలోకి మారాలనే ఒత్తిడి తనపై లేదని చెప్పారు. వివాహం కోసం మతం మారడం తనకు ఇష్టం ఉండదని అంజూ స్పష్టం చేశారు. (I will go to India only after engagement with Nasrullah)
పాక్‌లో అంజూకు ఘనస్వాగతం
తన ప్రేమికుడైన నస్రుల్లాను కలిసేందుకు పాకిస్థాన్ దేశంలోని దీర్ బాలా జిల్లాకు వచ్చిన అంజూకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఆమెను కలిసేందుకు పాక్ జనం తరలివస్తుండటంతో నస్రుల్లా ఇల్లు సందడిగా మారింది. తన కుమారుడు అనారోగ్యం పాలవడంతో తాను అంజూతో మాట్లాడగా ఆమె పాకిస్థాన్ వెళ్లినట్లు తేలిందని ఆమె భర్త అరవింద్ చెప్పారు. తన భార్య జైపూర్ నగరానికి వెళతానని చెప్పి పాకిస్థాన్ వెళ్లిందని అరవింద్ తెలిపారు.
అంజూ ఫేస్‌బుక్ ప్రేమ కథ…
తనకు 2020వ సంవత్సరంలో ఫేస్‌బుక్ ద్వారా పాకిస్థాన్ దేశానికి చెందిన నస్రుల్లా పరిచయం అయ్యాడని అంజూ చెప్పింది. తనకు పాకిస్థాన్ దేశంలో చాలా బాగుందని, ఇక్కడి ప్రజలు మంచివారని ఆమె వ్యాఖ్యానించారు. తాను భర్తతో చెప్పకుండా పాక్ వచ్చి, ఆ తర్వాత పిల్లలతో తరచూ మాట్లాడుతున్నాని ఆమె పేర్కొంది.
నిశ్ఛితార్థం చేసుకున్నాకే…వెళతా…
తాను నస్రుల్లాతో నిశ్చితార్థం చేసుకున్నాకే పిల్లల కోసం భారతదేశానికి వస్తానని అంజూ వెల్లడించింది. పాక్ లో పరిస్థితులన్నీ చూశాకే తాను నిశ్చితార్థం చేసుకుంటానని, ఆ తర్వాతే భారత్ కు వచ్చి మిగతా పెళ్లి ప్రక్రియ పూర్తి చేసుకుంటానని చెప్పారు. (Indian woman Anju’s sensational comments) నా ప్రియుడు నస్రుల్లాతో తన ప్రేమ బాగుందని, ఆయన కుటుంబసభ్యులు మంచివారని, వారంతా చాలా ప్రేమగా మాట్లాడుతున్నారని అంజూ తెలిపింది.
తమ ఇద్దరి ప్రేమ వ్యక్తిగతం
భారతదేశానికి చెందిన తన ప్రేయసి అంజూతో త్వరలో నిశ్చితార్థం చేసుకుంటానని, ఆ తర్వాత ఆమెను భారతదేశానికి పంపిస్తానని నస్రుల్లా చెప్పారు. మళ్లీ అంజూ పెళ్లి చేసుకునేందుకు పాక్ వస్తుందని, తమ ఇద్దరి వ్యక్తిగత జీవితమని, ఇందులో ఎవరి జోక్యం తమకు ఇష్టం లేదన్నారు. అంజూ అక్కడే ఉన్నట్లు దీర్ బాలా డీపీఓ మొహమ్మద్ ముస్తాక్ వెల్లడించారు.
రెండేళ్లు వేచి ఉన్నారు…
అంజూ చట్టబద్ధంగా వీసా తీసుకొని పాక్ రావడానికి రెండేళ్లు వేచి ఉన్నారని సమాచారం. పాక్, భారత్ దేశ పౌరుల మధ్య ప్రేమ కథలు కొత్తవేమి కావు. అంజూతో తన పరిచయం ప్రేమగా మారిందని, ఇద్దరం కలిసి బతకాలని నిర్ణయించుకున్నామని, దీనికి తన కుటుంబం ఆమోదం తెలిపిందని చెప్పారు.
వీసా కోసం ఎంబసీల చుట్టూ చక్కర్లు కొట్టాం
అంజూకు చాలా కష్టంగా పాకిస్తాన్ వీసా లభించిందని నస్రుల్లా చెప్పారు. ఓ వైపు అంజూ దిల్లీలోని పాక్ ఎంబసీ చుట్టూ తిరుగుతుంటే, మరోవైపు ఇస్లామాబాద్‌లోని విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఇతర కార్యాలయాల చుట్టూ నస్రుల్లా చక్కర్లు కొట్టారు.
అంజూ నిర్ణయాలను గౌరవిస్తా…
అంజూ ఆఫీసులో సెలవు తీసుకొని పాకిస్తాన్‌కు వచ్చారని, భారత్‌కు తిరిగి వెళ్లిన తర్వాత కూడా ఆమె తన ఉద్యోగాన్ని కొనసాగిస్తారని నస్రుల్లా చెప్పారు. ‘‘మా అనుబంధంలో మతం ప్రమేయం లేదు. మతం మారడం, మారకపోవడం అంజూ ఇష్టం. ఆమె నిర్ణయాన్ని నేను గౌరవిస్తా. ఆమె కూడా నా నిర్ణయాలను గౌరవిస్తారు’’ అని పాక్ ప్రియుడు నస్రుల్లా వివరించారు.