IMF..World Bank Warn of Increasing Risk of Global Recession
Pakistan economic crisis: పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ బృందం ఆ దేశానికి చేరుకుంది. రుణాల విషయంలో తొమ్మిదో సారి సమీక్ష నిర్వహించనుంది. చాలా కాలంగా ఐఎంఎఫ్ నుంచి పాక్ కు నిధులు నిలిచాయి. పాక్ తీరు వల్ల ఐఎంఎఫ్ నుంచి కొత్త అప్పులు రావడంలో జాప్యం జరుగుతోంది.
దాదాపు రూ.57 వేల కోట్ల నిధులను అందించే క్రమంలో ఐఎంఎఫ్ అధికారులు ఇస్లామాబాద్ లో ప్రభుత్వంతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. నాలుగు రోజుల పాటు పాకిస్థాన్ తో ఐఎంఎఫ్ అధికారులు చర్చలు జరపనున్నారు. పాక్ లోని పలు శాఖల నుంచి ఆర్థిక సమాచారాన్ని తీసుకుని సమీక్షించనున్నారు.
కాగా, అమెరికా డాలర్ తో పోల్చితే పాకిస్థాన్ రూపీ విలువ రూ.260కి దిగజారింది. పాకిస్థాన్ ఆర్థిక, ఆహార, రాజకీయ సంక్షోభం అంచున నిలుస్తుండడంతో ఆ దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోలు, డీజిల్ సహా నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఐఎంఎఫ్ నుంచి ఈ దఫా నిధులు అందకపోతే పాక్ మరింత సంక్షోభంలోకి కూరుకుపోయి శ్రీలంక తరహా పరిస్థితులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది.