Entire village on sale for ₹2 crore in Spain
Salto de Castro: ఎవరైనా ఇళ్లు, భూములు అమ్ముతారు. కానీ, స్పెయిన్ అనే దేశంలో ఏకంగా గ్రామాన్నే అమ్మకానికి పెట్టారు. అది కూడా జస్ట్ రెండు కోట్ల రూపాయలకే. స్పెయిన్-పోర్చుగల్ దేశాల సరిహద్దులో మాడ్రిడ్‌కు మూడు గంటల దూరంలో ఉన్న సాల్టో డే క్యాస్ట్రో అనే గ్రామాన్ని 260,000 యూరోలకు (అటు ఇటుగా 2 కోట్ల రూపాయలు) అమ్మకానికి పెట్టారు. ఈ గ్రామంలో 40 ఇళ్లు, ఒక హోటల్, ఒక చర్చ్, ఒక స్కూల్, ఒక మున్సిపల్ స్విమ్మింగ్ పూల్, కాస్తంత క్రీడా స్థలం, పాత సివిల్ గార్డ్ బ్యారక్స్ ఉన్నాయి.
వాస్తవానికి ఈ గ్రామాన్ని మూడు దశాబ్దాల క్రితమే వదిలిపెట్టారు. గ్రామంలోని బిల్డింగులు కూలిపోయే దశలో ఉన్నాయి. ఈ గ్రామాన్ని 2000 ఏడాదిలో దాలిసియా ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి కొనుగోలు చేశాడు. అయితే ఈ గ్రామాన్ని టూరిజం స్పాటుగా మారుద్దామని అనుకున్నాడు. ఆ ప్రయత్నం ప్రారంభించి 2008లో ఆపేశాడు. వాస్తవానికి ఆయన దగ్గర సరిపడా డబ్బులు లేవట. అందుకే ఆ ప్రయత్నాన్ని నిలిపివేశాడట. అయితే ఆ ప్రాజెక్టును కొనసాగించాలనే ఉద్దేశంతోనే అమ్మకానికి పెట్టినట్లు రోన్నీ రోడ్రిగూజ్ అనే వ్యక్తి తెలిపారు.
ఈ విషయమై ఆ గ్రమా యజమాని మాట్లాడుతూ ‘‘వాస్తవానికి నేను పట్టణంలో నివసించే వ్యక్తిని. గ్రామీణ ప్రాంతాన్ని నేను నిర్వహించలేకపోయాను. పైగా నా దగ్గర ఉన్న డబ్బు సరిపోవడం లేదు. అందుకే వదులుకోవాలని అనుకుంటున్నాను. అయితే ఈ గ్రామాన్ని కొనుగోలు చేసే వ్యక్తికి నా ప్రాజెక్టు గురించి చెప్తాను. దాన్నెలాగైనా టూరిజం స్పాటుగా మార్చేందుకు ప్రయత్నిస్తాను’’ అని పేర్కొన్నారు. కాబట్టి.. మీ దగ్గర రెండు కోట్ల రూపాయలు ఉంటే స్పెయిన్ వెళ్లి సాల్టో డే క్యాస్ట్రో అనే గ్రామాన్ని కొనుగోలు చేయొచ్చు. అంతే కాదు, మరిన్ని డబ్బులు ఉంటే ఆ గ్రామాన్ని టూరిజం స్పాటుగా మార్చొచ్చు.