కరోనాతో చైనా ప్రపంచాన్ని ముంచేసింది.. ఇప్పుడేమో ముద్దుల పోటీ పెట్టింది.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!

  • Publish Date - April 21, 2020 / 11:28 AM IST

ప్రపంచమంతా కరోనాతో పోరాడుతుంటే.. వైరస్ అంటించిన చైనా మాత్రం సామాజిక దూరాన్ని పక్కన పెట్టేసింది. కరోనా నియంత్రణలో ప్రధాన ఆయుధమైన భౌతిక దూరాన్ని పట్టించుకోలేదు. కరోనా వ్యాప్తితో మూతపడిన ఓ ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభించే కార్యక్రమంలో భాగంగా ముద్దుల పోటీని నిర్వహించింది.

దీనిపై చైనా సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాజిక దూరం నిబంధనల సమయంలో సదరు ఫ్యాక్టరీపై ఇలాంటి చర్యలకు పాల్పడటంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా నుంచి క్రమంగా బయటపడుతున్న చైనా నెమ్మదిగా ఆంక్షలను ఎత్తివేస్తోంది.

ఒక్కొక్కటిగా ఫ్యాక్టరీలు, ఇతర సంస్థలు తిరిగి తెరుచుకుంటున్నాయి. అందరూ తమ పనుల్లోకి వెళ్లిపోతున్నారు. సుజౌ నగరంలోని ‘Yueya’ అనే ఫర్నిచర్ ఫ్యాక్టరీ 10 జంటలను ముద్దుల పోటీలో పాల్గొనమని ఆహ్వానించింది. ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగుల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జంటలను ప్రొటెక్టివ్ గ్లాసుకు ఇరువైపులా నిలబడమని చెప్పి.. ఒకరినొకరు ముద్దుపెట్టుకోవాలని సూచించింది. ఈ క్రమంలో మాస్క్ ధరించిన జంటలన్నీ తొలగించి ముద్దుల పోటీల్లో పాల్గొన్నాయి. ఇరువురి మధ్య గాజు అద్దం అడ్డుగా ఉండేలా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులందరూ బ్లూ బాయిలర్ సూట్లు ధరించి కనిపించారు.

గ్లోబల్ టైమ్స్ ప్రకారం.. ఫ్యాక్టరీలో పనులు తిరిగి ప్రారంభించడానికి ముద్దుల పోటీని నిర్వహించారు. కరోనావైరస్ వ్యాప్తి నియంత్రణలో రావడంతో లాక్ డౌన్ సమయంలో చైనా విధించిన ఆంక్షలను సడలించడం ప్రారంభించింది. వైరస్ వ్యాప్తి కాకుండా ఉండేలా పోటీలో పాల్గొనేవారి మధ్య గ్లాస్ అడ్డుగా ఉంచినట్లు ఫ్యాక్టరీ యజమాని మా చెప్పారు. పాల్గొన్న వారిలో కొందరు వాస్తవానికి వివాహం చేసుకున్న జంటలు, వీరిద్దరూ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారని అన్నారు. కరోనా ప్రభావంతో ప్రతి ఒక్కరూ మానసికంగా ఒత్తిడికి లోనయ్యారు. విశ్రాంతి తీసుకునే పరిస్థితి లేకపోయింది.

ఉద్యోగులు ఫ్యాక్టరీ పనుల్లో చురుకుగా ఉంటేనే ఉత్పత్తిలో ఎలాంటి తప్పులు జరగకుండా ఉంటాయి. అందుకే సరదాగా గడిపేందుకు ముద్దుల పోటీని నిర్వహించడం జరిగింది’ అని తెలిపారు. ప్రతి ఒక్కరి మధ్య ప్లెక్సి గ్లాస్ ముక్కను ఉంచామన్నారు. ఆల్కాహాల్ తో గ్లాసులపై స్ప్రే చేసినట్టు చెప్పారు.

ఈ పోటీతో ఇప్పటికీ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. పోటీలో పాల్గొనేవారు సామాజిక దూరాన్ని పాటించడంలో విఫలమయ్యారని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. చైనాలో ముద్దుల పోటీకి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.