అగ్ర రాజ్యాధినేత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24-25 తేదీల్లో భారత్ లో పర్యటించబోతున్నారు. ట్రంప్ కు ఘన స్వాగతం పలకటానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ట్రంప్ భారత పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో కలసి అహ్మదాబాద్‌లో రోడ్ షో చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయి.
ఫిబ్రవరి 24న జరిగే ఈ రోడ్ షో దాదాపు 22 కిలోమీటర్ల పొడవున సాగుతుంది. దీనికి 50 వేల మంది ప్రజలు తమ సాంప్రదాయ వస్త్ర ధారణతో హాజరై మోడీ-ట్రంప్ లకు స్వాగతం చెప్పనున్నారని అహ్మదాబాద్ మేయర్ బిజాల్ పటేల్ చెప్పారు. ఈ రోడ్‌షో ద్వారా ట్రంప్–మోడీలు సబర్మతీ ఆశ్రమం చేరుకుంటారు. ట్రంప్ సబర్మతీ ఆశ్రమం సందర్శన అనంతరం..ఇద్దరూ కలసి మొతెరాలో నిర్మించిన క్రికెట్ స్టేడియాన్ని చేరుకుంటారు.
మొతెరాలో నిర్మించిన అతి పెద్ద క్రికెట్ స్టేఢియంను మోడీ-ట్రంప్ లు ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో వారిరువురూ పాల్గొంటారు. 22 కిలోమీటర్ల పొడవున ప్రజలు నిలబడే పెద్ద రోడ్‌షో ఇదే కావచ్చని బిజాల్ పటేల్ చెప్పారు.
మోడీ-ట్రంప్ రోడ్ షో కు ప్రభుత్వం పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం దాదాపు 10,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తునట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. వీరంతా 25 మంది ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో విధులు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు.
ముఖ్యమైన ప్రాంతాల్లో 65 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 200 మంది ఇన్స్‌పెక్టర్లు, 800 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లు విధుల్లో పాల్గొంటారని డీసీపీ విజయ్ పటేల్ వెల్లడించారు. వీరితో పాటు అదనంగా అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు… నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్‌ఎస్‌జీ), స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ)కు చెందిన భద్రతా దళాలను ఇక్కడ రోడ్ షో జరిగే 22 కిలోమీటర్ల ప్రాంతంలో మోహరించనున్నారు.