Nepal Floods : నేపాల్ ను ముంచెత్తిన వరదలు.. 5 మంది మృతి, మరో 28 మంది గల్లంతు

చైన్ పూర్, పంచ్ ఖపన్ మున్సిపాలిటీల్లో కొండచరియలు విరిగిపడి నదీ ప్రవాహాన్ని అడ్డుకోవడంతోటే వరదలు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు.

Nepal floods

Rains And Floods : నేపాల్ లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు సంభవించాయి. తూర్పు నేపాల్ లోని మూడు జిల్లాల్లో శనివారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. వర్షాలతో ఇప్పటివరకు 5 మంది మృతి చెందారు. మరో 28 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. చైన్ పూర్ మున్సిపాలిటీ-4 ప్రాంతంలో హేవా నది ఉప్పొంగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో సూపర్ హేవా హైడ్రోపవర్ ప్రాజెక్టు సమీపంలో వరదలు సంభవించడంతో అక్కడ పని చేస్తున్న 16 మంది సిబ్బంది గల్లంతయ్యారు.

Heavy Rainfall in Tamil Nadu: పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు.. తమిళనాడులో స్కూళ్లకు సెలవులు

సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. చైన్ పూర్, పంచ్ ఖపన్ మున్సిపాలిటీల్లో కొండచరియలు విరిగిపడి నదీ ప్రవాహాన్ని అడ్డుకోవడంతోటే వరదలు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు.

వరదల కారణంగా పలు చోట్ల ఇళ్లు నీటిలో కొట్టుకుపోయాయని తెలిపారు. రాబోయే రోజుల్లో నేపాల్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ట్రెండింగ్ వార్తలు