శ్రీలంకలో బాంబు పేలుళ్లు ఆగడం లేదు. తాజాగా 8వ పేలుడు సంభవించింది. కొలంబో సమీపంలోని డెమటోగోడ ప్రాంతంలో బాంబు పేలింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. ఆదివారం (ఏప్రిల్ 21,2019) మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. అంతకుముందు దేహీవాలుజా ప్రాంతంలో ఏడో పేలుడు జరిగింది. వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక చిగురుటాకులా వణికిపోతోంది. ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శ్రీలంకలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి. ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. 6 గంటల వ్యవధిలో 8 పేలుళ్లు జరిగాయి.
శ్రీలంకలోని 3 చర్చిలు, మరో 3 స్టార్ హోటళ్లలో ఆదివారం (ఏప్రిల్ 21,2019) ఉదయం పేలుళ్లు సంభవించాయి. ఆ తర్వాత కొలంబోలో బాంబులు పేలాయి. పేలుళ్లలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటివరకు 187 మంది చనిపోయారు. 350 మందికి పైగా గాయపడ్డారు. బాంబు పేలుళ్లలో మృతి చెందిన వారిలో 35మంది విదేశీయులు ఉన్నారు. ఈ తరహా దాడుల్లో విదేశీయులు చనిపోవడం ఇదే మొదటిసారి అని సమాచారం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు అధిక సంఖ్యలో ఉండటంతో వారికి చెందిన గ్రూప్ రక్తం ఎక్కించడం కష్టంగా మారింది. ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ లలో రక్త నిల్వలు లేకపోవడంతో క్షతగాత్రులకు రక్తం ఎక్కించడం సాధ్యపడక పలువురు మృతి చెందారు.