చచ్చిబతికిన దొంగ : బ్రూస్ లీ బామ్మ.. కిక్ ఇచ్చిందా ఖతమే!

  • Publish Date - November 25, 2019 / 09:09 AM IST

ఆమె ఓ లేడీ బ్రూస్ లీ.. వయస్సు 82ఏళ్లు. ఇరవైఏళ్ల కుర్రాదానిలా జిమ్‌లో కసరత్తులు చేసేస్తోంది. పెద్ద బాడీబిల్డర్ కూడా. పంచులు మీద పంచులు విసురుతోంది. తనకు వయస్సు పెరిగినా ఏమాత్రం సత్తువ తగ్గలేదంటోంది ఈ బ్రూస్ లీ బామ్మ. ఆమే 82ఏళ్ల విల్లయ్ ముర్ఫీ. చిన్నప్పటి నుంచి బాక్సింగ్ అంటే పిచ్చి. చూడటానికి ఐదు అడుగులే ఉంటుంది. కానీ, 105lbs బరువును అమాంతం పైకి ఎత్తేస్తుంది. దాదాపు 225 పౌండ్ల బరువును కూడా ఇట్టే ఎత్తగలదు. 

పాపం.. బ్రూస్ లీ బామ్మ సంగతి తెలియక.. ఓ రోజు ఇంట్లోకి దొంగ చొరబడ్డాడు. బామ్మ ఒక్కదే ఉంది. ఏం చేస్తుందిలే.. దొంగతనం ఇక ఈజీలే అనుకున్నాడు. లోపలికి వచ్చేసి బామ్మపై దాడి చేయబోయాడు. అంతే.. మెరుపు వేగంతో ఆ దొంగపైకి ఎగిరిదూకింది బామ్మ. గట్టిగా ఒక పంచ్ విసిరింది. 29ఏళ్ల దొంగను నేలకేసి కొట్టింది. వరుస పంచ్ లు విసరడంతో బామ్మ దెబ్బకు కుర్ర దొంగ చచ్చినంత పనైంది. 

న్యూయార్క్‌లోని రోచెస్టర్ నగరంలో గురువారం రాత్రి 11గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. బామ్మ అంతటితో ఆగలేదు. దొంగను ఏమాత్రం కోలుకోనివ్వలేదు. కిందపడేసి చేతికి ఏది దొరికితే దాంతో చితకబాదింది. చీపురు తిరగేసింది. షాంపు అతడి ముఖంపై పూసి ఉక్కిరిబిక్కిరి చేసింది. అతడి తలను బల్లాకేసి అదిపి పట్టింది. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు వచ్చేసరికి దొంగ పరిస్థితి లేవలేని పరిస్థితి ఉంది. అది చూసిన పోలీసులు షాక్ అయ్యారు. ఒక వృద్ధురాలు ఎలా ఒక దొంగను ఇంత దారుణంగా కొట్టిందా అని నివ్వెరపోయారు. 

దెబ్బలు తిన్న ఆ దొంగను అంబులెన్స్ లో పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాడీబిల్డర్ బామ్మ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపింది. ‘నేను ఒంటరి.. వృద్ధురాలని కూడా. కానీ, నేనెంతో స్ట్రాంగ్. నన్ను ఎదుర్కోండి చూద్దాం’ అంటూ సవాల్ విసిరుతోంది. రోజులో ఎక్కువ సమయం జిమ్ లోనే గడుపుతానని చెప్పుకొచ్చింది. పవర్ లిఫ్టర్ అయిన బామ్మ తనకు ఎదురైన అనుభవాన్ని ఎలా చెబుతుందో వీడియోలో చూడండి.