×
Ad

Iran Protests: 2వేల మంది మృతి.. ఇరాన్‌లో మారణహోమం.. మిన్నంటిన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు

ఈ ఆందోళనలకు సంబంధించి అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఆందోళనకారులకు ఏమైనా జరిగితే తాము రంగంలోకి దిగుతామని పదే పదే హెచ్చరిస్తున్న ట్రంప్..

Iran Protests Representative Image (Image Credit To Original Source)

 

  • ఇరాన్ వ్యాప్తంగా నిరసన జ్వాలలు
  • 2వేల మంది మృతి, 10వేల మంది అరెస్ట్
  • సైనిక చర్య దిశగా ట్రంప్ సన్నాహాలు
  • అమెరికా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు

Iran Protests: ఇరాన్ రగిలిపోతోంది. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. మారణహోమానికి దారితీశాయి. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో రక్తపాతం పారుతోంది. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు 2వేల మంది మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మరణాలకు ఉగ్రవాదులే కారణమని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించగా.. భద్రతా దళాల కాల్పుల వల్లే పౌరుల మరణాలు సంభవించాయని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మరింత ఉధృతం అవుతుండగా ఆంక్షలు కూడా అలానే కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణల్లో రోజురోజుకు మరణాల సంఖ్య పెరుగుతోంది.

అట్టుడికిపోతున్న ఇరాన్..

కొంత కాలంగా ఇరాన్ అట్టుడికిపోతోంది. ఇరాన్ వ్యాప్తంగా నిరసన జ్వాలలు రగులుతున్నాయి. ఆందోళనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆందోళనకారులను సైన్యం తీవ్రంగా అణిచివేస్తుండటంతో ఇరాన్ వీధులు నెత్తురోడుతున్నాయి. ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య ఏకంగా 2వేలకు చేరింది. అలాగే దాదాపు 10 వేల మందికిపైగా ఆందోళనకారులను సైన్యం అరెస్ట్ చేసింది. మరోవైపు అక్కడ ఇంటర్నెట్ నిలిపివేశారు.

సైనిక చర్య అవకాశాలను తీవ్రంగా పరిగణిస్తున్న ట్రంప్..

ఇటు ఇరాన్ పై సైనిక చర్య అవకాశాలను అమెరికా తీవ్రంగా పరిగణిస్తోందన్న వార్తలు పశ్చిమాసియా వ్యాప్తంగా ఉద్రిక్తతలు పెంచాయి. యుద్ధ మేఘాలు అలుముకుంటున్న సంకేతాలను ఇస్తున్నాయి. ఈ ఆందోళనలకు సంబంధించి అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఆందోళనకారులకు ఏమైనా జరిగితే తాము రంగంలోకి దిగుతామని పదే పదే హెచ్చరిస్తున్న ట్రంప్.. సైనిక చర్య దిశగా సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. సైనిక అధికారులు ఇప్పటికే అధ్యక్షుడితో చర్చించారని సమాచారం.

ఇరాన్ పై చర్య విషయంలో పలు ప్రతిపాదనలు ట్రంప్ ముందు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇందులో అమెరికా నేరుగా జోక్యం చేసుకోకుండా పరోక్షంగా రంగంలోకి దిగే సూచనలు ఉన్నాయి. ఈ ప్రతిపాదనలపై ట్రంప్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. మృతుల సంఖ్య పెరిగితే ఆయన తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు అమెరికా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ సైతంహెచ్చరించింది.

ఆందోళనకారులను ఉగ్రవాదులతో పోల్చిన అధ్యక్షుడు..

అటు ఆందోళనకారులను ఉగ్రవాదులతో పోల్చారు ఇరాన్ అధ్యక్షుడు. ఈ మూకలు సమాజాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అదే సమయంలో ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. దేశాన్ని అస్థిర పరిచేందుకు అమెరికా, ఇజ్రాయల్ కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం తమ కర్తవ్యం అని, అంతకంటే ముందు అల్లరి మూకలు సమాజాన్ని నాశనం చేయకుండా చూడాలని ఓ ఇంటర్వ్యూలో ఇరాన్ అధ్యక్షుడు తెలిపారు.

Also Read: ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై 25% సుంకాలు.. ఇండియాలో ఈ రంగాలు కుదేలవుతాయా? ట్రంప్‌ అసలు లక్ష్యం భారతేనా?