Aliens: భూమిపై ఏలియన్స్..! 1940 నుంచి అంతరిక్షనౌక వచ్చి వెళ్తోంది.. సంచలన విషయాలు వెల్లడించిన అమెరికా నిఘా అధికారులు

భూమిపైనే గ్రహాంతర వాసుల ఉనికి ఉందంటూ అమెరికా నిఘా విభాగం అధికారులు సంచలన విషయం వెల్లడించారు.

Aliens

Aliens on Earth: భూమిపై ఏలియన్స్ (గ్రహాంతర వాసులు) ఉన్నారా..? ఉండి ఉంటే మనలాగే ఉంటారా..? భూమిని, మనుషుల్ని చూస్తుంటారా..? ఎప్పుడైనా భూమి మీదకు వచ్చారా.. ? ఇలా అనేక అంతుచిక్కని ప్రశ్నలు మానవాళిని నిత్యం వేధిస్తూనే ఉంటున్నాయి. ఏలియన్స్ జాడ కనుగొనేందుకు శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. కొందరు పరిశోధకులు భూమిపై ఏలియన్స్ ఉన్నాయని బలంగా చెబుతుండగా.. మరికొందరు మాత్రం అలాంటివేమీ లేదని చెప్పుకొస్తున్నారు. అయితే, తాజాగా. అమెరికా నిఘా విభాగం అధికారులు సంచలన విషయాన్ని వెల్లడించారు.

 

భూమిపై గ్రహాంతర వాసుల ఉనికి ఉందంటూ అమెరికా నిఘా విభాగం అధికారులు సంచలన విషయం వెల్లడించారు. ‘ది ఏజ్ ఆఫ్ డిస్ క్లోజర్’ పేరుతో కొత్తగా విడుదలైన ఓ డాక్యుమెంటరీలో విశ్వంలో మనతో పాటు.. మరో గ్రహంలోనూ జీవుల ఉనికి ఉందని వివరించారు. ఇతర గ్రహం నుంచి భూమిపైకి వచ్చే అంతరిక్ష నౌకలు (యూఏపీ) ఉన్నాయని, వాటి గురించి తమకు స్పష్టంగా తెలుసని ఆ డాక్యుమెంటరీలో 34 మంది మిలిటరీ, నిఘా అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం భూమిపైనే గ్రహాంతరవాసులు ఉంటున్నారని వారు కుండబద్దలు కొట్టారు.

 

1940ల నుంచి ఏలియన్స్ అంతరిక్ష నౌక ద్వారా భూమిపైకి వచ్చి వెళ్తున్నారని, మన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిని గ్రహాంతర వాసులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని అమెరికా నిఘా అధికారులు డాక్యూమెంటరీలో పేర్కొన్నారు. గ్రహాంతర వాసులు అంతరిక్ష నౌక ద్వారా భూమిపైకి వచ్చివెళ్తున్న విషయం తెలిసికూడా అమెరికా ప్రభుత్వం గోప్యత పాటిస్తోందంటూ వారు విమర్శించడం గమనార్హం. అంతేకాదు.. దేశ భద్రతకే ఇది పెద్దముప్పుగా పరిణమించబోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రహాంతర వాసుల అంతరిక్ష నౌకల వేగం గంటకు 50వేల మైళ్లు దాటి ఉంటుందని వారు ఆ డాక్యూమెంటరీలో వెల్లడించారు.

 

డాక్యుమెంటరీలో సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో, న్యూయార్క్ సెనేటర్ కిరెన్ గిల్లి బ్రాండ్ కూడా తమ అభిప్రాయాలు వెల్లడించారు. నిఘా అధికారుల వాదనను వారు కొట్టిపారేశారు. ఆ యూఏపీలు ప్రపంచంలోని ఇతర దేశాలకు చెందిన ప్రయోగాలకు సంబంధించినవి కావచ్చని గిల్లిబ్రాండ్ అన్నారు. మరోవైపు.. మాజీ మిలిటరీ అధికారి ఎలిజోండో గ్రహంతర వాసులు ఉన్నారన్న అంశంపై స్పందిస్తూ.. ప్రపంచ మిలిటరీ శక్తి సామర్థ్యాలను ఏలియన్స్ పరిశీలిస్తున్నారని నమ్ముతున్నట్లు చెప్పుకొచ్చారు.