H-1B Visa: మళ్లీ హెచ్-1బీకి లక్ష డాలర్ల ఫీజు.. ఫెడరల్ కోర్టు తీర్పుపై స్టే.. విదేశీ ఉద్యోగులకు ఎదురుదెబ్బ
అమెరికాలో హెచ్-1బీ వీసా(H-1B Visa)లపై ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన లక్ష డాలర్ల వివాదాస్పద అదనపు రుసుము తాత్కాలికంగా తిరిగి అమల్లోకి వచ్చింది.
- V Santhosh Kumar
- Published on- June 16, 2026 / 09:39 AM IST
America h1b visa one hundred thousand dollar fee restored
- మళ్లీ హెచ్-1బీకి లక్ష డాలర్ల ఫీజు.
- కోర్టు స్టేతో నిపుణుల్లో తీవ్ర అనిశ్చితి.
- ఐటీ కంపెనీలపై భారీ ఆర్థిక భారం.
H-1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా(H-1B Visa)లపై ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన లక్ష డాలర్ల (రూ.90 లక్షలకు పైగా) వివాదాస్పద అదనపు రుసుము తాత్కాలికంగా తిరిగి అమల్లోకి వచ్చింది. ఇటీవల ఫెడరల్ కోర్టు ఈ భారీ ఫీజును కొట్టివేస్తూ తీర్పునిచ్చినప్పటికీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో మసాచుసెట్స్ జిల్లా కోర్టు ఈ చార్జీని పునరుద్ధరించింది. ప్రభుత్వ అప్పీల్ పెండింగ్‌లో ఉన్నందున ఈ నెల 12న కోర్టు స్టే మంజూరు చేయడంతో, కంపెనీల యాజమాన్యాలు, విదేశీ ఐటీ నిపుణులు మళ్లీ తీవ్ర అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అమెరికా ఉద్యోగుల ప్రయోజనాలను రక్షించే నెపంతో, హెచ్-1బీ లాటరీకి ఎంపికైన అభ్యర్థులు విధిగా లక్ష డాలర్ల ప్రత్యేక రుసుము చెల్లించాలని గత సెప్టెంబరులో ట్రంప్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన ఫెడరల్ జిల్లా కోర్టు ఈ నెల 8న ఈ రుసుమును చట్టవిరుద్ధంగా ప్రకటించింది. ఈ అదనపు రుసుము కేవలం ఫీజు కాదని, ఇది పన్ను కిందకు వస్తుందని, సరైన చట్టపరమైన అధికారం లేకుండా విధించారని కోర్టు తప్పుబట్టింది.
అయితే, ఈ తీర్పుపై ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేయడంతో కోర్టు తన పాత తీర్పుపై స్టే విధిస్తూ, అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం (యూఎస్సీఐఎస్) ఈ ఫీజును తాత్కాలికంగా వసూలు చేసుకునేందుకు అనుమతించింది. కాన్సులర్ నోటిఫికేషన్ ద్వారా దాఖలు చేసే కొన్ని పిటిషన్లకు ఇది వర్తిస్తుంది. ఈ ఆకస్మిక మార్పుతో నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులపై ఆధారపడే కంపెనీలకు భారీ ఆర్థిక భారం పడనుందని, దీనివల్ల కంపెనీలు కొత్త నియామకాలను తాత్కాలికంగా వాయిదా వేసే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
