American Soldier : చిన్నారికి తల్లిప్రేమ పంచిన అమెరికా సోల్జర్ మృతి

ఓ అఫ్ఘాన్ చిన్నారిని తన ఒడిలోకి తీసుకోని లాలించిన అమెరికా సైనికురాలు మరీన్, తాజాగా జరిగిన ఆత్మహుతి దాడిలో మృతి చెందారు.

American Soldier

American Soldier :  అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబుల్ లో గురువారం ఆత్మహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో సుమారు 100 మంది వరకు మృతి చెందారు. మృతుల్లో 13 మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఆత్మహుతి దాడిలో మృతి చెందిన 13 మంది సైనికుల పేర్లు, వారి వివరాలను అమెరికా రక్షణ శాఖ అధికారులు గుర్తించారు. మృతుల్లో మరిన్ అనే మహిళా సైనికురాలు కూడా ఉన్నారు. ఆమె మరణించడానికి ముందు తీసిన ఒక ఫొటో వైరల్‌గా మారింది.

ఆ ఫొటోలో మహిళ ఆఫీసర్.. ఆఫ్ఘానిస్తాన్ కి చెందిన చిన్నారిని తన ఒడిలోకి తీసుకుని తల్లిప్రేమ చూపించారు. ఈ ఫొటో ప్రపంచమంతటా వైరల్ అయింది. ఎంతోమందిని ఆకట్టుకుంది. ఐతే…  ఆమె మరణవార్త చాలామందిని కలచివేసింది. అమెరికా పౌరుల తరలింపులో భాగంగా అఫ్ఘానిస్తాన్ వచ్చిన ఈమె.. తిరిగి తమ దేశానికి శవమై వెళ్లారు.

మరోవైపు అఫ్ఘానిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు కాబుల్ ఎయిర్ పోర్టు దగ్గర విమానాల కోసం ఎదురుచూస్తున్న ప్రజలపై అరాచకాలకు పాల్పడుతున్నారు. వారిపై దాడులకు దిగుతున్నారు. మరోసారి ఆత్మహుతి దాడి జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మీడియా ముఖంగా తెలిపారు. కాబుల్ విమానాశ్రయం వద్ద అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు తెలిపారు.

ఈ నెల 31తో అమెరికా బలగాల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. గడువు లోపు అమెరికా తన బలగాలను ఉపసంహరించుకోకపోతే పరిణామాలు వేరేలా ఉంటాయని తాలిబన్లు ఇప్పటికే హెచ్చరించారు. ఇక తాలిబన్ల హెచ్చరికతో ఇతర దేశాలు కూడా భయపడుతున్నాయి. తమ దేశ పౌరుల తరలింపులో వేగం పెంచాయి.