Madagascar Gen Z protest: మరో దేశంలో జెన్-జీ నిరసనలు చెలరేగాయి. తూర్పు ఆఫ్రికా దేశం మడగాస్కర్‌లో జెన్-జీలు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. అక్టోబర్ 13న ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రీ రజోయెలినా దేశం విడిచిపోయారని వార్తలు వచ్చాయి. దీంతో ఈ నిరసనలు పూర్తిస్థాయి తిరుగుబాటుగా మారాయి.
దీంతో మడగాస్కర్ సైనికులు స్పందిస్తూ.. తాము నిరసనకారులను అణచివేయబోమని, తాము ప్రజలను రక్షించేందుకే ఉన్నామని ప్రకటించారు. ఆ దేశంలో చోటుచేసుకుంటున్న పరిస్థితులపై స్పష్టమైన రిపోర్టులు రావడం లేదు. సెప్టెంబర్ 25 నుంచే ప్రారంభమైన నిరసనలు ఇవాళ తీవ్రరూపం దాల్చాయి. ముఖ్యంగా దేశంలో నీటి, విద్యుత్ కొరత వల్ల ఈ నిరసనలు ప్రారంభమయ్యాయి.
ఆ తర్వాత దేశంలో అవినీతి, పాలనలో వైఫల్యం, ప్రాథమిక సేవల్లో లోపాలు వంటి సమస్యలపై కూడా జెన్-జీలు ప్రశ్నిస్తున్నారు. నేపాల్, మొరాకో, బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న జెన్-జీ ఉద్యమాల తర్వాత చోటుచేసుకుంటున్న మరో పోరాటం ఇది. 2009లో ఆండ్రీ రజోయెలినా అధికారంలోకి రావడానికి మడగాస్కర్ సైనిక విభాగం క్యాప్సాట్ (CAPSAT) సపోర్టు ఇచ్చింది.
ఇప్పుడు మాత్రం నిరసనకారుల పక్షాన నిలిచింది. నిరసనకారులపై కాల్పులు జరపకుండా వారితో కలిసి రాజధాని ఆంటాననారీవోలో ప్రదర్శనలో కూడా పాల్గొంది. ఆ విభాగం కొత్త సైన్యాధిపతిని కూడా నియమించింది. ఆ వెంటనే జెండార్మరీ (సైనిక పోలీసు విభాగం)లోని కొన్ని విభాగాలు కూడా నిరసనకారుల పక్షాన చేరాయి.
Also Read: ఘోర బస్సు ప్రమాదం.. 57 మందితో వెళ్తూ తగలబడిన బస్సు.. ఎలా జరిగిందంటే?
అధ్యక్షుడు ఆండ్రీ రజోయెలినా మడగాస్కర్ దేశం విడిచి పారిపోయారని ప్రతిపక్ష నేత సిటెని రాండ్రియనసొలోనియైకో సహా పలువురు అధికారులు తెలిపారు. ఆండ్రీ రజోయెలినా ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు.
ఆండ్రీ రజోయెలినా ఓ లైవ్ కార్యక్రమంలో తాజాగా కనపడి మాట్లాడారు. సెప్టెంబర్ చివరి నుంచి జరుగుతున్న హత్య, కూప్ (తిరుగుబాటు) ప్రయత్నాల కారణంగా తాను “భద్రమైన ప్రదేశం”లో ఆశ్రయం తీసుకున్నానని చెప్పారు. కూప్ అంటే ప్రభుత్వాన్ని సైన్యం ద్వారా కూల్చడం. కొందరు సైనికాధికారులు, రాజకీయ నాయకులు తనను చంపాలని యత్నించారని, అందువల్ల తాను ప్రాణ రక్షణ కోసం వెనక్కు తగ్గానని తెలిపారు. “నా ప్రాణాన్ని రక్షించుకోవడం తప్ప వేరే మార్గం లేదు” అని అన్నారు.