Asim Munir: పాకిస్థాన్ భౌగోళిక రాజకీయాల్లో పెను సంచలనం.. 4 రాష్ట్రాలను 15 ముక్కలుగా.. ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ బిగ్ స్కెచ్!
పాకిస్థాన్ రాజకీయ రూపురేఖలను మార్చివేసే ఒక వ్యూహాన్ని ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్(Asim Munir) తెరపైకి తెస్తున్నారు.
- V Santhosh Kumar
- Published on- October 9, 2026 / 11:21 AM IST
Army Chief Asim Munir has proposed dividing Pakistan four provinces into smaller states.
Asim Munir: పాకిస్థాన్‌లో దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న రాజకీయ రూపురేఖలను పూర్తిగా మార్చివేసే ఒక సంచలనాత్మకమైన వ్యూహాన్ని ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్(Asim Munir) తెరపైకి తెస్తున్నారు. ప్రస్తుతం పంజాబ్, సింధ్, ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ అనే నాలుగు ప్రధాన ప్రావిన్సులుగా ఉన్న పాకిస్థాన్‌ను దాదాపు 12 నుంచి 15 చిన్న రాష్ట్రాలుగా లేదా 160 పరిపాలనా ప్రాంతాలుగా విభజించాలని సైనిక వర్గాలు భావిస్తున్నాయి. పంజాబ్‌లోనే అత్యధికంగా 12.8 కోట్ల జనాభా ఉండటం, పాలన ప్రజలకు దూరమవ్వడమే దీనికి కారణమని ఆర్మీ ప్రతిపాదిస్తున్నప్పటికీ, ప్రావిన్సుల రాజకీయ బలాన్ని తగ్గించి కేంద్రంలో తమ పట్టును మరింత బిగించడమే సైన్యం అసలు ఉద్దేశమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రాంతీయ అధికార కేంద్రాలపై దెబ్బ.. ఆర్మీ ప్లాన్ వెనుక అసలు కథ:
ఈ పునర్వ్యవస్థీకరణ వెనుక కేవలం పరిపాలనా సౌలభ్యం మాత్రమే కాకుండా తీవ్ర రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. పంజాబ్‌లో PML-N, సింధ్‌లో PPP వంటి బలమైన ప్రాంతీయ పార్టీలు ప్రావిన్సుల స్థాయిలో సైనిక నిర్ణయాలకు ఎదురుతిరిగే శక్తిని కలిగి ఉన్నాయి. వీటిని చిన్న ముక్కలుగా విభజించడం ద్వారా ఆయా ప్రావిన్సుల రాజకీయ ప్రభావాన్ని బలహీనపరిచి, సైనిక స్థాపనపై పూర్తిగా ఆధారపడేలా చేయవచ్చనేది మునీర్ ప్లాన్. అంతేకాకుండా, ప్రస్తుతం ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని PTI చేపడుతున్న భారీ నిరసనలు, ప్రభుత్వంపై తెస్తున్న తీవ్ర ఒత్తిడి సైన్యానికి మింగుడుపడటం లేదు.
పీఓకే, బలూచిస్తాన్‌లలో అసంతృప్తి.. దేశంలో చెలరేగుతున్న ఆందోళనలు:
మరోవైపు సుదీర్ఘకాలంగా వేర్పాటువాదం, తీవ్రవాదంతో అల్లాడుతున్న బలూచిస్తాన్ సరిహద్దులను సవరించడం అత్యంత సున్నితమైన అంశంగా మారింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో కూడా ఆర్థిక సంక్షోభం, పన్నుల భారం, ఆర్మీ వేధింపులపై ఇప్పటికే ప్రజలు రోడ్లపైకి వచ్చి తీవ్ర స్థాయిలో నిరసనలు తెలుపుతున్నారు. ఇటువంటి తీవ్ర అశాంతి నెలకొన్న సమయంలో దేశ రాజ్యాంగ స్వరూపాన్ని మార్చేసే ఈ విభజన ఆలోచన పాకిస్థాన్‌ను మరింత అంతర్యుద్ధంలోకి నెట్టే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
