×
Ad

Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో షాక్..! ఆ కేసులో..

షేక్ హసీనాను తమకు తిరిగి అప్పగించాలని బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం భారత్ ను కోరింది.

Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో షాక్ తగిలింది. కోర్టు ఆమెకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. పూర్బాచల్ ప్లాట్ స్కామ్ కేసులో ఢాకాలోని ప్రత్యేక కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ఇదే కేసులో షేక్ హసీనా సోదరి రెహనాకు ఏడేళ్లు, షేక్ హసీనా మేనకోడలు, బ్రిటన్ ఎంపీ తులిప్ సిద్ధిక్ కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.

షేక్ హసీనా కుటుంబం ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి పూర్బాచల్ ప్రాంతంలో అక్రమంగా ప్లాట్లను పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. షేక్ హసీనా, ఆమె కుటుంబసభ్యులు ఉద్దేశపూర్వకంగా నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని కోర్టు తీర్పు ఇచ్చింది. హసీనా కుమారుడు, కుమార్తెలకు కూడా ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష విధించడంతో పాటు ఫైన్ వేసింది కోర్టు.

ఢాకా ట్రైబ్యూన్ ప్రకారం.. పూర్బాచల్ ప్రాజెక్ట్ కింద ప్లాట్ల కేటాయింపులో జరిగిన అవకతవకలపై అవినీతి నిరోధక కమిషన్ (ACC) ఆరు వేర్వేరు కేసులను దాఖలు చేసింది. షేక్ హసీనా, ఆమె పిల్లలు, సోదరి రెహానా, మేనకోడలు సిద్ధిక్, ఇతర బంధువుల కోసం సెక్టార్ 27లోని దౌత్య జోన్‌లో 6 ప్లాట్‌లను (7,200 చదరపు అడుగులు) చట్ట విరుద్ధంగా పొందారని ACC ఆరోపించింది. జనవరి 2025లో దాఖలు చేసిన కేసులో భాగంగా హసీనా పిల్లలు, సైమా వాజెద్ సహా 29 మందిపై అభియోగాలు మోపారు.

బ్రిటన్ పార్లమెంట్‌లో హాంప్‌స్టెడ్ హైగేట్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న తులిప్ సిద్ధిక్ గతంలో ఈ ఆరోపణలను ఖండించారు. ఈ విచారణను కల్పిత ఆరోపణలపై నిర్మించిన ప్రహసనంగా, రాజకీయ ప్రతీకారంతో చేసినదిగా అభివర్ణించారు. జనవరిలో ప్రధాని కీర్ స్టార్మర్ క్యాబినెట్‌లో ట్రెజరీకి, ఆర్థిక కార్యదర్శి పదవికి తులిప్ రాజీనామా చేశారు.

21 సంవత్సరాల జైలు శిక్ష..

హసీనాపై వచ్చిన అనేక తీర్పులలో ఈ తీర్పు ఒకటి. పూర్బాచల్ ప్రాజెక్టుకు సంబంధించిన మూడు అవినీతి కేసుల్లో ఈ నెల ప్రారంభంలో ఢాకాలోని ప్రత్యేక కోర్టు ఆమెకు 21 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. జాయ్, పుతుల్ లకు కూడా ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఆగస్టు 5, 2024న హసీనా అవామీ లీగ్ పాలనను భారీ నిరసనలు దించేశాయి. ఆ తర్వాత ఆమె భారత్ లో ఆశ్రయం పొందారు. షేక్ హసీనా పరారీలో ఉన్నట్లు బంగ్లాదేశ్ కోర్టు ప్రకటించింది.

గత ఏడాది జూలై-ఆగస్టులో జరిగిన విద్యార్థి ఉద్యమాన్ని అణచివేసినందుకు బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) షేక్ హసీనాను దోషిగా నిర్ధారించి.. ఆమెకు మరణ శిక్ష కూడా విధించింది. షేక్ హసీనాను తమకు తిరిగి అప్పగించాలని బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం భారత్ ను కోరింది. ఈ అభ్యర్థనను న్యాయపరంగా పరిశీలిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ప్రస్తుతం బంగ్లాదేశ్ ని నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం నడుపుతోంది. తదుపరి పార్లమెంటరీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరుగుతాయని ప్రకటించింది.

Also Read: మరకల గోల..! లండన్ కు ఎంత కష్టం వచ్చింది..! ఆ ఎర్రని మరకల క్లీనింగ్ కోసం 35 లక్షలు ఖర్చు..