George Floyd: సంచలన కేసులో పోలీస్‌ అధికారికి 270నెలల జైలు శిక్ష

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జార్జ్ ఫ్లాయిడ్ హత్యకేసులో ఎట్టకేలకు మాజీ పోలీసు అధికారి డెరిక్ చౌవిన్‌(45)కు కఠిన శిక్ష విధించింది మిన్నియాపాలిస్ కోర్టు.

Black Lives Matter: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జార్జ్ ఫ్లాయిడ్ హత్యకేసులో ఎట్టకేలకు మాజీ పోలీసు అధికారి డెరిక్ చౌవిన్‌(45)కు కఠిన శిక్ష విధించింది మిన్నియాపాలిస్ కోర్టు. డెరిక్‌ను దోషిగా నిర్ధారించిన మిన్నియాపాలిస్ కోర్టు 270నెలలు అంటే ఇరవై రెండున్నర సంవత్సరాల జైలు శిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది కోర్టు. జార్జ్ ఫ్లాయిడ్ అనే న‌ల్ల‌జాతీయుడిని అమెరికా పోలీస్ డెరిక్ చౌవిన్‌ గతేడాది మే 25వ తేదీన అత్యంత పాశవికంగా మోకాలితో రోడ్డుపై అదిమిపట్టి చనిపోయేందుకు కారణం అయ్యాడు.

పోలీస్ మోకాలితో నొక్కి అదిమిపట్టిన సమయంలో.. తనకు ఊపిరి ఆడట్లేదని, కాలు తీయాలని ఫ్లాయిడ్ డెరిక్‌ను వేడుకున్నా కనికరించలేదు. తర్వాత ఫ్లాయిడ్‌డ ఆసుపత్రిలో మరణించాడు. ఇందుకు సంబంధించి వీడియోలు, పొటోలు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవగా.. “Black Lives Matter” అంటూ ప్రజల నుంచి నిరసన జ్వాలలు వ్యక్తం అయ్యాయి. తీర్పు సంధర్భంగా ‘భావోద్వేగంతోనో.. సానుభూతితోనో డెరిక్‌ను శిక్షించట్లేదు’ అని జడ్జి పీటర్‌ కాహిల్‌ ప్రకటించారు.

మంచి ప్రవర్తనతో, 45 ఏళ్ల చౌవిన్ తన శిక్షలో మూడింట రెండు వంతుల లేదా 15 సంవత్సరాల శిక్ష అనుభవించిన తరువాత పెరోల్‌పై బయటకు వచ్చే అవకాశం ఉంది. తీర్పు సంధర్భంగా.. చేతులు కట్టుకుని నుంచున్న డెరిక్ చౌవిన్ ఫ్లాయిడ్ కుటుంబానికి తన సానుభూతిని తెలియజేశారు. ఫ్లాయిడ్‌ కుటుంబం తరపున అతని ఏడేళ్ల కూతురు తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ మాట్లాడిన మాటలు కంటతడి పెట్టించాయి.

ట్రెండింగ్ వార్తలు