Lung Cancer Blood Test : వైద్య రంగంలో నూతన ఆవిష్కరణ.. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ఐదేళ్ల ముందే గుర్తించే బ్లడ్ టెస్ట్..

Lung Cancer Blood Test : కొత్త బ్లడ్ టెస్ట్ అందుబాటులోకి వస్తే ప్రారంభ దశలోనే క్యాన్సర్‌ను గుర్తించి చికిత్స అందించే అవకాశం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

Lung Cancer Blood Test

Lung Cancer Blood Test : ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను (లంగ్ క్యాన్సర్) ఐదేళ్ల ముందే గుర్తించే సామర్థ్యం ఉన్న కొత్త రక్త పరీక్షను వైద్య నిపుణులు అభివృద్ధి చేశారు. ఈ పరీక్ష అందుబాటులోకి వస్తే లక్షలాది మంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని వైద్య వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Also Read – Elon Musk House : మస్క్ ఉండే అద్దె ఇల్లు ఇదే.. రెంట్ ఎంతంటే.. రూ.100 లక్షల కోట్లు ఆస్తులున్నా అద్దె ఇంట్లోనే ఎందుకంటే..

అమెరికాకు చెందిన గార్డాంట్ (Guardant Health) సంస్థ ఈ వినూత్న బ్లడ్ టెస్ట్‌ను అభివృద్ధి చేసింది. రక్త నమూనా ద్వారా క్యాన్సర్‌కు సంబంధించిన జన్యు మార్పులను గుర్తించి, వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించేందుకు ఈ పరీక్ష ఉపయోగపడనుంది. ఈ విధానానికి ఇప్పటికే అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ఆమోదం కూడా లభించింది.

వైద్యుల ప్రకారం.. లంగ్ క్యాన్సర్‌ను స్టేజ్-1లోనే గుర్తిస్తే 75 శాతం వరకు పూర్తిగా కోలుకునే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం చాలా మంది రోగుల్లో వ్యాధి ముదిరిన తర్వాతే నిర్ధారణ కావడంతో చికిత్స కష్టతరమవుతోంది. దీంతో మరణాల సంఖ్య కూడా అధికంగా నమోదవుతోంది.

భారత్‌లో ప్రతి సంవత్సరం సుమారు 90వేల కొత్త లంగ్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. వీరిలో గణనీయమైన సంఖ్యలో రోగులు ఆలస్యంగా వ్యాధిని గుర్తించడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. కొత్త బ్లడ్ టెస్ట్ అందుబాటులోకి వస్తే ప్రారంభ దశలోనే క్యాన్సర్‌ను గుర్తించి చికిత్స అందించే అవకాశం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

వైద్య రంగంలో ఇది ఒక కీలక ముందడుగుగా భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ పరీక్ష విస్తృతంగా అందుబాటులోకి వస్తే ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా జరిగే ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.