Bungee Jump Tragedy: బంజీ జంపింగ్ అంటూ అమ్మాయిని తోసేశారు.. తాడు కట్టడం మర్చిపోయారు.. ఘోరం జరిగిపోయిందిగా
బంజీ జంపింగ్ (Bungee Jump Tragedy)లో భద్రతా ప్రమాణాల్లో చిన్న నిర్లక్ష్యం కూడా ఎంతటి విషాదానికి దారితీస్తుందో బ్రెజిల్‌లో జరిగిన ఒక ఘటన మరోసారి గుర్తు చేసింది.
- V Santhosh Kumar
- Published on- June 14, 2026 / 05:39 PM IST
Brazil bungee jump tragedy woman dies after safety rope was not attached
- తాడు లేకుండానే బంజీ జంప్
- 130 అడుగుల లోతులో పడి మృతి
- ఘటనపై ఆరుగురిని అరెస్ట్ చేశారు
Bungee Jump Tragedy: బంజీ జంపింగ్ వంటి అడ్వెంచర్ క్రీడలు ఉత్కంఠను, ఆనందాన్ని అందిస్తాయని భావిస్తారు. అయితే భద్రతా ప్రమాణాల్లో చిన్న నిర్లక్ష్యం కూడా ఎంతటి విషాదానికి దారితీస్తుందో బ్రెజిల్‌లో జరిగిన ఒక ఘటన మరోసారి గుర్తు చేసింది. కేవలం 21 ఏళ్ల యువతి, జీవితంలో ఒక సాహస అనుభూతిని ఆస్వాదించాలనే ఉద్దేశంతో బంజీ జంప్‌కు సిద్ధమైంది. కానీ భద్రతా తాడు అమర్చకుండానే ఆమెను వంతెనపై నుంచి దూకించడంతో ఆ యువతి 130 అడుగులకుపైగా లోతులో పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
Ap Rains: ఏపీకి రెడ్ అలర్ట్.. పిడుగులు, ఈదురుగాలులతో భారీ వర్షం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
బ్రెజిల్‌లోని సావో పాలో రాష్ట్రంలో ఉన్న స్కెలిటన్ బ్రిడ్జిపై ఈ విషాదం చోటుచేసుకుంది. మరణించిన యువతిని మరియా ఎడ్వర్డా రోడ్రిగ్స్ డి ఫ్రీటాస్ గా గుర్తించారు. ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తున్న బంజీ జంపింగ్(Bungee Jump Tragedy) కార్యక్రమంలో పాల్గొన్న ఆమెను సిబ్బంది వంతెన అంచుకు తీసుకెళ్లి దూకించారు. అయితే ఆమె శరీరానికి భద్రతా తాడు అనుసంధానం చేయలేదని తర్వాత గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. యువతి కిందపడుతుండగా అక్కడున్న వారు “రోప్… రోప్…” అంటూ కేకలు వేయడం వీడియోల్లో వినిపిస్తోంది.
యువతి లోయలో పడిపోవడంతో వెంటనే అత్యవసర సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదానికి కొద్దిసేపటి ముందు ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. “నన్ను వంతెనపై నుంచి దూకేందుకు అనుమతించిన ఆ పిచ్చివాడు ఎవరు?” అంటూ సరదాగా చేసిన పోస్టు విషాదాంతానికి ముందు చేసిన చివరి సందేశంగా మిగిలిపోయింది. ఘటన సమయంలో ఆమె కాబోయే భర్త కూడా అక్కడే ఉండగా, ఈ విషాద వార్త తెలుసుకుని అస్వస్థతకు గురైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన అధికారులు వెంటనే విచారణ ప్రారంభించారు. ఘటనాస్థలంలో ఉన్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. భద్రతా నిబంధనలు పాటించారా? సిబ్బంది నిర్లక్ష్యం ఉందా? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సంఘటన అడ్వెంచర్ టూరిజం రంగంలో భద్రతా ప్రమాణాలపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తగా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
