Site icon 10TV Telugu

Earthquake: టర్కీలో భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు.. ఇండ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు.. వీడియోలు వైరల్

Turkey Earthquake

Turkey Earthquake

Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం సంభవించింది. టర్కీలోని బలికెసిర్ ప్రావిన్సులో ఆదివారం సాయంత్రం 6.1 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. దీనివల్ల 200 కిలోమీటర్లు దూరంలోని ఇస్తాంబుల్‌లోనూ భూమి కంపించింది. ప్రజలు ఇండ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. పలు ప్రాంతాల్లో ఇండ్ల పేకమేడల్లా కూలిపోయాయి.


సిందిర్గి పట్టణంలో దాదాపు 16 భవనాలు కూలిపోయాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. అయితే, ఈ శిథిలాల కింద చిక్కుకొని ఒకరు మృతిచెందినట్లు సమాచారం. పూర్తిసమాచారం రావాల్సి ఉంది. మరోవైపు భూకంపం ధాటికి 29మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. శిథిలాలను తొలగించేందుకు రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగారు. అయితే, భూకంపం దాటికి కుప్పకూలిన భవనాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


భారీ భూకంపం తరువాత అనేక ప్రకంపనలు వచ్చాయని.. ఇవి రిక్టర్ స్కేలుపై అత్యధికంగా 4.6గా నమోదైనట్లు టర్కీ విపత్తు, అత్యవసర నిర్వహణ సంస్థ పేర్కొంది. దెబ్బతిన్న భవనాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించింది.


టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ తన ‘ఎక్స్’ ఖాతాలో స్పందించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దేవుడు మన దేశాన్ని ఎలాంటి విపత్తు నుండి అయినా రక్షించుగాక అంటూ పేర్కొన్నారు.


టర్కీలో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. 2023లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా టర్కీలో 53,000 మందికి పైగా, ఉత్తర సిరియాలో 6,000 మందికి పైగా మరణించారు. గ‌త నెల జులై మొద‌ట్లో కూడా 5.8 తీవ్ర‌త‌తో భూకంపం సంభ‌వించింది. ఈ స‌మ‌యంలో ఒక‌రు మర‌ణించ‌గా, 69 మంది గాయ‌ప‌డ్డారు.

Exit mobile version