కళ్లజోడు ధరిస్తే కరోనా రాదా? COVID-19 నుండి గ్లాసెస్ రక్షించగలదా? నిపుణులు ఏం చెబుతున్నారు

  • Publish Date - September 17, 2020 / 01:09 PM IST

కళ్లలోని శ్లేష్మ పొరల ద్వారా కూడా కరోనావైరస్ వ్యాపిస్తుందని తెలిసిన విషయమే. అందుకే, కరోనావైరస్ బారిన పడకుండా తమను తాము కాపాడుకోవడానికి, హెల్త్ కేర్ వర్కర్లు, రక్షణ పరికరాలలో భాగంగా ఫేస్ షీల్డ్స్, గాగుల్స్ ధరిస్తారు. ఇంతవరకు బానే ఉంది. అయితే సాధారణ కళ్లజోడు కరోనావైరస్ ను అడ్డుకోగలదా? వైరస్ బారి నుంచి మనల్ని రక్షించగలదా? అనే ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేస్తోంది. ఇప్పుడిది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. దీనిపై జరిపిన రీసెర్చ్ లో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.

కళ్లద్దాలు ధరించేవారు కరోనా బారిన పడే అవకాశం తక్కువ:
చైనాలోని సుయిజౌలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 276 మంది కరోనా రోగులపై రీసెర్చ్ చేశారు. వారిలో, రోజులో కనీసం 8 గంటల పాటు కళ్లజోడు ధరించే వారి వివరాలు సేకరించారు. JAMA ఆప్తామాలజీ ప్రచురించిన ఈ అధ్యయనంలో, సాధారణ జనాభాలో 31 శాతం మంది కళ్లజోడు ధరించగా, COVID-19 తో ఆసుపత్రిలో చేరిన వారిలో 5.8 శాతం మంది మాత్రమే ఉన్నారు. అంటే, “కళ్లద్దాలు ధరించేవారు COVID-19 బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుందని ఈ పరిశోధనలు సూచిస్తున్నాయి” అని రీసెర్చ్ కి నేతృత్వం వహించిన వారు చెప్పారు.

అప్పుడే ఓ అంచనాకు రావడం కరెక్ట్ కాదు:
ఈ అధ్యయనం ప్రకారం, కొవిడ్ 19 నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కళ్లజోడు, గాగుల్స్, లేదా ఫేస్ షీల్డ్ ధరించాలనే విషయం స్పష్టమవుతోంది. అయితే కేవలం ఒకే ఒక్క పరిశీలనా అధ్యయనం చదివేసి ఓ అంచనాకు వచ్చేయడం కరెక్ట్ కాదని నిపుణులు అంటున్నారు. అంతేకాదు, కళ్లజోడు ఏ విధంగా కరోనావైరస్ ను అడ్డుకుంటుంది అనేది చెప్పడం చాలా కష్టం అంటున్నారు. దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందన్నారు. ఇప్పుడే ఓ అంచనాకు వచ్చేయడం కష్టం అని నిపుణులు అభిప్రాయపడ్డారు. కళ్లజోడు ధరించినప్పటికి, తరుచుగా చేతులతో కళ్లను తాకడం ద్వారా వైరస్ బారిన ప్రమాదం లేకపోలేదన్నారు.

“కళ్ళజోడు కొంతవరకు కరోనా నుంచి రక్షణ కల్పిస్తుంది అనేది నిజమే అయితే, గాగుల్స్ లేదా ఫేస్ షీల్డ్ వంటి మరింత రక్షణ అందించేవి రావాలని మేము ఆశిస్తున్నాము” అని నిపుణులు చెప్పారు. ఈ అధ్యయనం చదివాక, వెంటనే గాగుల్స్ కొనడానికి వెళ్లిపోయే ముందు ఒక్క నిమిషం ఆలోచన చేయాలని, కళ్లజోడు ధరిస్తే తక్కువ ప్రమాదం ఉందని నిర్ధారించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమని నిపుణులు స్పష్టం చేశారు.

కళ్లద్దాలపై కరోనావైరస్, 9 రోజుల వరకు జీవిస్తుంది:
కరోనా వైరస్ ముక్కు, నోరు, చెవుల ద్వారా వ్యాపిస్తుందని డాక్టర్లు చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కళ్లకు అద్దాలు వాడేవారు ‘హమ్మయ్య నాకు కళ్లద్దాలు రక్షణగా ఉన్నాయి’ అనుకున్నారు. అయితే, కళ్లద్దాల వల్ల కూడా కరోనా వ్యాపిస్తుందని ఇటీవలే నిపుణులు తేల్చారు. తలనొప్పికి, దృష్టి లోపాలకు కళ్లద్దాలు వాడేవారు కొందరైతే.. కరోనా వచ్చినప్పటి నుంచి మరికొందరు కళ్లకు ఏలోపం లేకపోయినా కరోనా నుంచి రక్షణకు మామూలు కళ్లద్దాలు వాడుతున్నారు. తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో కళ్లద్దాలపైనా వైరస్ ఉంటుందని, అది కూడా ఏకంగా తొమ్మిది రోజుల పాటు జీవిస్తుందని తేలింది. బయటకు వెళ్లినప్పుడు, ఆసుపత్రులు, మెడికల్ షాపులకు వెళ్లే క్రమంలో కళ్లద్దాలను శుభ్రం చేసుకుంటే మంచిదని నిపుణులు హెచ్చరించారు.
https://10tv.in/antibodies-may-not-guarantee-protection-from-covid-19-scientists/
కళ్లద్దాలను ఇలా శుభ్రం చేసుకోవాలి:
కళ్లద్దాలను శుభ్రం చేసెయ్యమన్నారని అమ్మోనియా, బ్లీచింగ్‌లతో కూడిన ద్రావణాలు, ఆల్కహాల్‌తో కూడిన శానిటైజర్లను అస్సలు వాడొద్దు అంటున్నారు. పొడి వస్త్రం లేదా పాత్రలు కడిగేందుకు ఉపయోగించే సబ్బు నురగను ఉపయోగించి కళ్లద్దాలను శుభ్రం చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. వాటితో అద్దాలపై ఉండే వైరస్‌లు సులభంగా తొలగిపోతాయని వారు తెలిపారు. అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు కళ్లద్దాలను శుభ్రం చేసుకోవడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణాన్ని వినియోగిస్తే మంచిదని సూచించారు.

3కోట్లకు చేరువలో కరోనా కేసులు:
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఇదివరకే గైడ్ లైన్స్ ను అప్‌డేట్ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరు కచ్చితంగా ఫ్యాబ్రిక్ ఫేస్ మాస్క్‌లు ధరించేలా తమ ప్రజలకు ఆదేశాలు ఇవ్వాలని అన్ని దేశాల ప్రభుత్వాలకు డబ్ల్యూహెచ్ఓ చెప్పింది. ఆ విధంగా చెయ్యడం వల్ల కోవిడ్ -19 వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి సాయపడుతుందని వెల్లడించింది. కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాదాన్ని తగ్గించడానికి ఏకైక సాధనం ఫేస్ మాస్కులే అని ఇటీవల నిర్వహించిన పలు అధ్యయనాల్లో తేలిందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.

9లక్షల 37వేల కరోనా మరణాలు:
ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3కోట్లకు చేరువలో ఉంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 9.37 లక్షలు దాటింది. జాన్స్ హాప్కిన్స్ లెక్కల ప్రకారం ఇప్పటివరకు కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా 9లక్షల 37వేల 111 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2 కోట్ల 96 లక్షల 74 వేల 788గా ఉంది. గురువారం(సెప్టెంబర్ 17,2020) లేదా శుక్రవారం(సెప్టెంబర్ 18,2020) ఈ సంఖ్య 3 కోట్లను దాటే అవకాశం ఉంది.

2కోట్ల 10లక్షల మంది కరోనాను జయించారు:
ఇక కరోనా నుంచి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల 10 లక్షల మందికి పైగా కోలుకున్నారు. కాగా.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. అమెరికా తర్వాత అత్యధిక కరోనా కేసుల జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉంది. అమెరికాలో 68 లక్షలకు పైగా కేసులు నమోదుకాగా.. భారత్‌లో కేసుల సంఖ్య 50 లక్షలు దాటింది.

ఆ రెండు దేశాల్లో లక్షలకుపైగా కరోనా మరణాలు:
ఇక బ్రెజిల్, రష్యా, పెరూ దేశాలు ఆ తర్వాతి మూడు స్థానాల్లో నిలిచాయి. మరణాల విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా లక్షకు పైగా మరణాలు నమోదైన దేశాల్లో అమెరికా, బ్రెజిల్ మాత్రమే ఉన్నాయి. బ్రెజిల్‌లో మరణాల సంఖ్య లక్షా 34 వేలు దాటితే.. అమెరికాలో ఈ సంఖ్య రెండు లక్షలు దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షల కరోనా మరణాలు నమోదైన దేశంగా అమెరికా మాత్రమే ఉంది. ఇక ప్రపంచం మొత్తం కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. ఈ ఏడాది చివరినాటికి సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అనేక దేశాల్లోని వివిధ కంపెనీలు చేస్తున్న వ్యాక్సిన్ ప్రయోగాలు చివరి దశకు చేరుకున్నాయి.

ట్రెండింగ్ వార్తలు