Canada 7 years old girl deadlifts 80kgs : ఏడేళ్ల చిన్నారులు స్కూలు బ్యాగ్ మోయడానికే ఆపసోపాలు పడుతుంటారు. అటువంటిది ఏడేళ్ల వయస్సులో ఓ చిన్నారి చేసే వెయిట్ లిఫ్టుంగుల గురించి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. 10 కాదు 20 కూడా కాదు ఏకంగా 70 కిలోలు, 80 కిలోల బరువులు ఎత్తేస్తూ సంచలనాల హవా సృష్టిస్తోంది కకెనడాకు చెందిన చిన్నారి ‘రోరీ వ్యాన్ ఉల్ట్’.
అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిన ఈ చిన్నారిని చూస్తే..మహా మహా వస్తాదులు కూడా షాక్ అవ్వాల్సిందే. ఉల్ట్ ఎత్తే బరువులకు..ఆమె వయస్సుకు ఏమాత్రం పొంతనలేదు.కండలు తిరిగినవారు కూడా ఎత్తలేని బరువుల్ని ఎత్తిపారేస్తోందీ చిన్నారి.
నిజానికి అడల్ట్ జిమ్నాస్ట్స్ మాత్రమే 70 కిలోల బరువు ఎత్తగలుగుతారు. కానీ ఏడేళ్ల ఉల్ట్ మాత్రం ఫుల్ డిఫరెంట్. 70 నుంచి 80కిలోల బరువు ఎత్తేసి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఉల్ట్ చేసే ఈ సాహస లిఫ్టుంగ్ లతో ‘స్ట్రాంగెస్ట్ గర్ల్ ఇన్ ది వరల్డ్’గా నిలిచింది.
తనను తాను జిమ్నాస్టిక్‌గా చెప్పుకోవడానికి ఇష్టపడే ఏడేళ్ల ఉల్ట్.. వెయిట్‌లిఫ్టింగ్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. 30 కిలోల విభాగంలో యూఎస్ అండర్-11, అండర్-13 టైటిళ్లు అందుకుని అత్యంత పిన్నవయస్సులో అమెరికా యూత్ నేషనల్ చాంపియన్‌గా రికార్డు సృష్టించింది. నాలుగు అడుగులు పొడవు ఉండే చిచ్చర పిడుగు చేసిన ఈ ఫీట్ ప్రపంచాన్నే నివ్వెరపరిచింది. అదంతా ఒక ఎత్తయితే, డెడ్‌లిఫ్ట్‌లో ఏకంగా 80 కిలోలు ఎత్తి ఔరా అనిపించింది. అంతేకాదు స్నాచ్‌లో 32 కిలోలు, జెర్క్‌లో 42 కిలోలు, స్క్వాట్‌లో 61 కిలోల బరువులెత్తి షాక్ కు గురిచేసింది.
రెండేళ్ల క్రితం నుంచి వెయిట్ లిఫ్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్న ఉల్ట్.. రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ సంచలనాల లిస్టుకు ఎన్ని రికార్డులు బద్దలవుతాయోమరి. యూఎస్, కెనడాలో ఇంతవరకు యూత్ నేషనల్ చాంపియన్‌షిప్‌ను రిప్రజెంట్ చేసే వెయిట్ లిఫ్టర్స్ ఎవరూ లేకపోవడంతో, యంగెస్ట్ యూఎస్ నేషనల్ చాంపియన్ చరిత్రలో తొలి వెయిట్ లిఫ్టర్‌గా రోరీ వ్యాన్ ఉల్ట్ నిలిచింది. ఉల్ట్ ప్రదర్శనలు చూసిన నెటిజన్లు ఆమెను ఆకాశానికి ఎత్తేస్తూ, అభినందనల వర్షం కురిపిస్తున్నారు.