London Paan Stains: గుట్కా నమలడం రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయడం. పాన్ నమలడం.. ఎక్కడ పడితే అక్కడ ఊసేయడం. మన దగ్గర ఇది చాలా చాలా కామన్. కొందరు చేసే ఇలాంటి వెధవ పనుల వల్ల రోడ్లన్నీ ఎర్రటి మరకలతో చండాలంగా మారుతున్నాయి. ఎక్కడ చూసినా ఎర్రటి మరకలే కనిపిస్తున్నాయి. ఆ వీధులన్నీ ఎంతో అపరిశుభ్రంగా మారుతున్నాయి. అనారోగ్య సమస్యలు తెచ్చి పెడుతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమస్యతో ఓ దేశం నలిగిపోతోంది. పాన్, గుట్కా మరకలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆ మరకలను క్లీన్ చేసేందుకు భారీగానే ఖర్చు చేయాల్సి వస్తోంది.
లండన్‌లో పెద్ద సమస్యే వచ్చింది. అక్కడ ఎటు చూసినా పాన్, గుట్కా మరకలే కనిపిస్తున్నాయి. ఈ మరకల కారణంగా అధికారులు విసుగెత్తిపోతున్నారు. పాన్, గుట్కా మరకలు వారికి ఖరీదైన సమస్యగా మారాయి. ఎందుకంటే, ఆ మరకలు క్లీన్ చేసేందుకు భారీగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రతి ఏటా మరకల క్లీనింగ్ కోసం అక్షరాల 35 లక్షలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోందట.
పాన్ లేదా గుట్కా నమిలి బహిరంగంగా ఉమ్మి వేయడం దక్షిణాసియా అంతటా సర్వ సాధారణం. దీంతో వీధులన్నీ ఎంతో మురికిగా, అపరిశుభ్రంగా కనిపిస్తాయి. ఈ దక్షిణాసియా ఆచారం ఇప్పుడు సరిహద్దులు దాటింది. విదేశాల్లో సైతం ఈ అపరిశుభ్రమైన అలవాటు కనిపిస్తోంది. ముఖ్యంగా UK ఈ పాన్, గుట్కా మరకల సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటోంది.
ఈవినింగ్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం ఉత్తర లండన్ కౌన్సిల్ ఏటా మరకల క్లీనింగ్ కోసం 35 లక్షలు ఖర్చు చేస్తోంది. గుట్కా, పాన్ మరకాలతో నిండిన దుకాణాలు, ఫుట్ పాత్ లు, భవనాలను శుభ్రం చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. పాన్, గుట్కా నమిలి ఉమ్మి వేయడం వల్ల అక్కడ ఎక్కడా చూసినా ఎర్రని మరకలే దర్శనం ఇస్తున్నాయి. ఫుట్ పాత్ లు, టెలిఫోన్ బాక్సులు ఇలా ఎక్కడ చూసినా ఎర్ర మరకలే.
బ్రెంట్ కౌన్సిల్ ఈ సమస్యకు “జీరో-టాలరెన్స్ విధానం” తీసుకుంటామని ప్రతిజ్ఞ చేసింది. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తెచ్చేదని, పర్యావరణానికి నష్టాన్ని కలిగించేదని తెలిపింది. అంతేకాదు మరకలు శుభ్రం చేయడానికి చాలా ఖర్చు అవుతోందని వాపోయింది. ఎంతో శ్రమిస్తున్నా మరకలను పూర్తిగా తొలగించడం దాదాపుగా అసాధ్యం అంటున్నారు. అధిక శక్తితో కూడిన క్లీనింగ్ పదార్ధాలు కూడా కొన్ని మరకలను తొలగించలేవని తెలిపారు.
ఈ సమస్యను పరిష్కరించేందుకు బ్రెంట్ కౌన్సిల్ బరోలోని మూడు హాట్‌స్పాట్‌లలో బ్యానర్లను ఏర్పాటు చేసింది. ”ఇక్కడ పాన్ ఉమ్మి వేయడం నేరం , ఈ ప్రాంతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గస్తీ తిరుగుతారు.. పాన్, గుట్కా ఉమ్మే వారికి 12వేల వరకు జరిమానా విధిస్తాం” అని బ్యానర్లలో రాసుంది. మన వీధులను నాశనం చేసే వారి పట్ల, పాన్ గుట్కా నమిలి ఉమ్మి వేసే వారి పట్ల ఏమాత్రం సహనం చూపని అధికారులు హెచ్చరించారు.
Also Read: జర్నీ సినిమాను తలపించే ఘోర ప్రమాదం.. 2 బస్సులు ఢీ.. 11 మంది మృతి..